వైసీపీని గెలిపించడమా ? ఓడించడమా ? ఏపీ బీజేపీ ముందు రెండే ఆప్షన్స్

By KTV Telugu On 26 May, 2022
image

ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. కానీ కేంద్రంలో అధికార పార్టీ. ఎన్నికలు ఎదుర్కునేందుకు అధికారం ఓ అడ్వాంటేజ్. అందుకే బీజేపీ ఎటు వైపు మొగ్గుతుందా అనే ఆసక్తి ఉంది. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ అదంతా మనస్ఫూర్తిగా చేస్తున్నారని ఎవరూ నమ్మడం లేదు. దానికి కారణం ఉంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఉన్న నేతల వ్యవహార శైలే దీనికి కారణం.  వారు తాను గెలవడం కన్నా…  ఇతర పార్టీలను గెలిపించడం.. ఓడించడంపైనే దృష్టి పెట్టారు. అక్కడే అసలు సమస్య వస్తోంది.

ఏపీ బీజేపీలో ప్రో వైసీపీ.. ప్రో టీడీపీ నేతలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు వర్గాలు ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీగా మారిపోయింది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య పొత్తుల పంచాయతి ప్రారంభమయింది.  టీడీపీతో పొత్తే లేదని.. ఉండందంటూ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటి వారు అదే పనిగా ప్రకటనలు చేస్తూంటారు. ట్వీట్లు చేస్తూంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వీరంతా ముందుగా వైసీపీ కంటే టీడీపీని విమర్శించి .. ఆ తర్వతా వైసీపీ దగ్గరకు వెళ్తూంటారు. వీరెవరికి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. వైసీపీతో పొత్తు లేకపోయినా సన్నిహితంగా ఉండాలని అనుకుంటారు. ఇక ఏపీ బీజేపీలో మరో వర్గం ఉంది. వారు ప్రో టీడీపీ. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వెళ్లిన వారు ఇప్పుడు పొత్తుల మాట వినిపిస్తున్నారు. బీజేపీ ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ అధ్యక్షుడని.. ఇప్పుడు ప్రకటనలు చేసే వారు కాదని అంటూంటారు.

ప్రో వైసీపీ నేతల చేతుల్లో ఏపీ బీజేపీ !

బీజేపీతో పొత్తు లేకుండా చంద్రబాబు అధికారంలోకి రాలేరని.. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదనేది బీజేపీ నేతల తొలి మాట చెబుతూంటారు. జాతీయపార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేకపోతున్నారు. బీజేపీ నేతల అభిప్రాయాలు ప్రకారం వైసీపీ గెల్చినా పర్వాలేదు కానీ.. టీడీపీ గెలవకూడదన్నది వారి సిద్ధాంతంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా టీడీపీతో పొత్తుల గురించే మాట్లాడుతున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటం లేదు. జనసేనతో పొత్తు గురించే మాట్లాడుతోంది. బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. పైగా ఆ పార్టీ మీద ప్రజల్లో కనీసం ఓ అభిప్రాయం కూడా లేదు. అయినా వారు టీడీపీ ఎందుకు పొత్తు కోసం ప్రయత్నిస్తుందో చెప్పుకోలేకపోతున్నారు. ఒక్క శాతానికన్నా దిగువకు ఓట్ల శాతం ఉన్న బీజేపీ అండగా టీడీపీ ఎలా గెలుస్తుందో వారు చెప్పాల్సి ఉంది. అది చెప్పలేకపోతున్నారు. బహుశా వైసీపీ గెలిస్తే తాము గెలిచినట్లేనని వారనుకోవడమే కారణం అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు ప్రస్తుతం బీజేపీలో కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు.

పెద్దగా పట్టించుకోని హైకమాండ్ !

కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణపై పెట్టినంత ఫోకస్ ఏపీపై పెట్టడం లేదు.  బహుశా తెలంగాణలో పట్టు చిక్కిన తర్వాత ఏపీపై పెడతారమో కానీ ఇప్పుడైతే.. ఏదో మొక్కుబడి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీతో కనిపించడం లేదు. బయటకు మాత్రం బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటున్నారు కానీ జనసేన నేతలెవరూ బీజేపీతో కలిసి రాజకీయాలు మాట్లాడుతున్నట్లు కానీ.. చేస్తున్నట్లుగా కానీ లేదు. కానీ ప్రకటనలు మాత్రం బీజేపీ జనసేనతోనే వెళుతోందని చెబుతున్నారు. ఓట్లు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. బీజేపీతో పొత్తులో పోటీ చేస్తే… ఓట్లు చీలడం తప్ప ప్రయోజనం ఉండదని పవన్ భావిస్తున్నారు. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే ఏడెనిమిది శాతం ఓట్లు వస్తాయి. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవ్వాలంటే… ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలవాల్సి ఉంటుంది. అప్పుడే వ్యతిరేక ఓటు కలుస్తుంది. అయితే రాజకీయాల విషయంలో సోము వీర్రాజు అండ్ బృందానికి కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. దీంతో అందరి చూపు హైకమాండ్ ఇచ్చే సూచనలపైనే ఉంది.

బీజేపీ కేంద్రంలో అధికార పార్టీగా ఎవరితో పొత్తులు పెట్టుకుంటే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. వైసీపీకి ఇప్పటి వరకూ లోపాయికారీగా సహకరిస్తోంది. కానీ నేరుగా పొత్తులు పెట్టుకోలేదు. పెట్టుకునే చాన్స్ కూడా లేదు. కానీ బీజేపీ వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేనతో కలుస్తుంది.. లేకపోతే జనసేనను కూడా టీడీపీతో కలవకుండా చేస్తుంది. అప్పుడు ఆ పార్టీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టత వచ్చే  అవకాశం ఉంది.