చంపేసి ముక్కలు..ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్.. క్రైమ్‌లో కొత్త ట్రెండ్!
ఢిల్లీలో ప్రియుడి చేతిలో దారుణహత్యకు గురైన శ్రద్ధావాకర్ ఉదంతం దేశాన్ని కుదిపేస్తోంది. ప్రేమించి సహజీవనం చేస్తున్నవాడు అంత కిరాతకంగా చంపి, శరీరభాగాలను ఫ్రిడ్జ్‌లో దాచిన ఉదంతం వింటేనే గగుర్పొడుస్తోంది. క్రూరత్వానికి కులం మతం ఉండవు. అయినా ఈ సంఘటనని లవ్‌జిహాద్ ఖాతాలో వేసే ప్రయత్నం కూడా జరిగింది. ఏదయినా మనిషి కూడా రెండుకాళ్ల క్రూరమృగమేనన్న విషయం శ్రద్ధావాకర్ దారుణహత్యతో అందరికీ అర్ధమైంది. అదే ఢిల్లీలో అలాంటిదే మరో దారుణం చూస్తుంటే మనం మనుషుల మధ్యే ఉన్నామా అన్న అనుమానం వస్తోంది.
శ్రద్ధావాకర్ హత్యకేసును దర్యాప్తుచేస్తున్న క్రమంలోనే అలాంటి ఘోరమైన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దొరికిన తలభాగం శ్రద్ధాది కాదు ఓ పురుషుడిదని గుర్తించటంతో పోలీసులు కూపీలాగితే మరో సంచలన హత్య బయటికొచ్చింది. హతుడు ఢిల్లీ పాండవ్‌నగర్‌కి చెందిన అంజన్‌దాస్. అతన్ని దారుణంగా హతమార్చింది భార్య అయితే, కొడుకు శవాన్ని ముక్కలు చేసి చెత్తలో విసిరేందుకు సహకరించాడు. ఢిల్లీ పాండవ్‌నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని తల, ఇతర మానవ శరీర భాగాలను జూన్‌లో స్వాధీనం చేసుకున్నారు. మొదటవాటిని శ్రద్ధావని భావించారు. ఆ ప్రాంత సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులకు షాకింగ్ సీన్స్ కనిపించాయి.
ఓ మహిళతో పాటు యువకుడు ఆ ప్రాంతానికి వచ్చివెళ్లటం కెమెరాల్లో రికార్డయింది. అక్కడ దొరికిన శరీర భాగాలు అదృశ్యమైన అంజన్ దాస్ అనే వ్యక్తివని గుర్తించిన పోలీసులు భార్య పూనమ్, కొడుకు దీపక్‌లను అరెస్టు చేశారు. నిద్రమాత్రలు ఇచ్చి గాఢనిద్రలో ఉన్న అంజన్‌ని చంపాక శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు. తర్వాత ఆ భాగాలను పాండవ్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారేశారు.
బీహార్‌కు చెందిన మృతుడు అంజన్‌దాస్‌కు గతంలోనే పెళ్లయి ఎనిమిదిమంది పిల్లలున్నారు. భర్త చనిపోయిన పూనమ్‌ని 2016లో పెళ్లిచేసుకున్నాడు. మద్యానికి బానిసైన అంజన్ వావివరసలు మరిచి పూనమ్ కూతురు, కోడలితో అసభ్యంగా ప్రవర్తించటంతో భార్య, కొడుకు అతన్ని హతమార్చారు. చంపి ముక్కలుచేసిన శరీరభాగాలను నాలుగురోజుల్లో పారేశారు. పోలీసులు ఇప్పటిదాకా ఆరు శరీరభాగాలను స్వాధీనం చేసుకున్నారు. కారణాలేమయినా ఇంతదారుణంగా ఇంట్లో మనిషిని చంపి ముక్కలు దాచి కరడుగట్టిన క్రిమినల్స్‌లా వ్యవహరించటం అందరినీ నివ్వెరపరుస్తోంది. కొందరు మనుషులు నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారనేందుకు ఈ దారుణాలే నిదర్శనం.