2024 కోసం వైసీపీ పాట్లు
అనిశ్చితి, అనుమానం, అయోమయం, ఆందోళన అన్ని కలిసి వైసీపీ రాజ్యసభ టికెట్ల కేటాయింపు జరిగిందనుకోవాలి. ఓటర్లు తమతోనే ఉండాలి. సామాజిక వర్గాలను మేనేజ్ చేసుకోవాలి. సొంత కులంలో మరింత విశ్వాసం కలిగించాలి. అవసరమైతే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారుండాలి. పాత కాపులకు కోపం రాకుండా జాగ్రత్త పడాలి.. అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ తలబొప్పికట్టకుండా చూసుకోవాలి. పదవి పొందిన ప్రతీ నాయకుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తన వంతు కంటే ఎక్కువ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇదే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్. నిజానికి భవిష్యత్తుపై ఆందోళన, భయంతో వచ్చిన గేమ్ ప్లాన్ అది..
ఆ నలుగురు….
నాలుగు రాజ్యసభా స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుత ఎంపీ విజయసాయి రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిని, కొంత కాలం క్రితం వరకు కూడా ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అని పిలిచేవారు. ఈ మధ్య జగన్ కు ఆయన మీద బాగా కోపం వచ్చి… ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత ఏం జరిగిందో అంతకు సమానమైన బాధ్యతలనే అప్పగించారు. మరో సారి రాజ్యసభ సభ్యత్వమివ్వరని వార్తలు వస్తున్న తరుణంలోనే విజయసాయికి సెకెండ్ ఛాన్స్ అనేశారు. ఢిల్లీ సర్కిల్స్ లో ఏదైనా మేనేజ్ చేయగలరన్న నమ్మకమే విజయసాయికి రెండో అవకాశం ఇప్పించిందని భావించాల్సి ఉంటుంది. దీనితో ఇప్పడు రెడ్డి సామాజిక వర్గంలో విజయసాయి పెద్ద లీడర్ అయిపోయారు. పైగా త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికీ వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 9కి చేరుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి నాలుగు శాతం ఓట్లు తగ్గుతాయి. అది వైసీపీతో భర్తీ చేసే వీలుంది. అందుకే బీజేపీకి, వైసీపీకి అనుసంధానకర్తగా విజయసాయి పనిచేస్తారని జగన్ విశ్వసిస్తున్నారు… ఇక నిరంజన్ రెడ్డి ప్రముఖ న్యాయవాది సుప్రీం కోర్టులో చక్రం తిప్పుతారన్న నమ్మకంతో ఆయనకు గాలం వేసేందుకే రాజ్యసభ టికెట్ ఇచ్చారని చెబుతున్నారు… నిరంజన్ రెడ్డి విషయంలో జగన్ రెడ్డికి వేరే సొంత లెక్కలు కూడా ఉండొచ్చు…
జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు .. ఇప్పుడున్న సీట్లలో సగం అంటే రెండు కేటాయించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఆక్వా పరిశ్రమ ప్రముఖుడు బీద మస్తాన్ రావుకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య… రాజకీయ నాయకుడి కంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగానే ఎక్కువ పేరు ఉంది. ఆయన వెంట బీసీ సామాజికవర్గానికి చెందిన యువకులు ఎక్కువగా తిరుగుతుంటారు. బీసీ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తారని కృష్ణయ్యకు పేరు ఉంది. 2014 ఎన్నికల్లోఆయన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత టీడీపీలో ఉన్నది కూడా పెద్దగా లేదు. తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన కృష్ణయ్య ఇప్పుడు జగన్ పుణ్యమాని మళ్లీ రాజకీయ వార్తల్లోకి ఎక్కారు. బీద మస్తాన్ రావు 2009లో కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి చెందారు. గత 2019 ఎన్నికల్లో కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా అధినేత చంద్రబాబు ఆదేశాలతో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయిష్టంగానే పోటీ చేసిన బీద మస్తాన్ రావు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగి వైసీపీలో చేరారు. అప్పుడు ఇచ్చిన హామీ ఆధారంగా జగన్ ఆయనకు ఇప్పుడు రాజ్యసభ టికెట్ కేటాయించారు. ఆక్వా పరిశ్రమలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారు. పైగా బీద మస్తాన్ రావుకు విజయసాయి రెడ్డి శిష్యుడన్న పేరు ఉంది. ఇద్దరు నెల్లూరు జిల్లా వాసులే…
తెలంగాణకు సగం
వైసీపీ రాజ్యసభ టికెట్లు సాధించిన వారిలో ఇద్దరు తెలంగాణ వాళ్లే. ఆర్, కృష్ణయ్య. నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు.
నిరంజన్ రెడ్డి .. నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి …ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్, ఢిల్లీలో ఉంటారు. రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాతిపదికన జరగవని, అఖిల భారత స్థాయిలో లెక్కలేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని వైసీపీ నేతలు వింత వాదన చేస్తున్నారు…. తమది ఆలిండియా పార్టీ అని చెప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న జోకులు కూడా వినిపిస్తున్నాయి…
సామాజిక వర్గాలే ముఖ్యం
2024 ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచి లెక్కలేసుకుంటోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాజ్యసభ టికెట్లు కేటాయించారని భావిస్తున్నారు. ఇద్దరు బీసీల్లో కృష్ణయ్య… తమ సామాజిక వర్గాలను ప్రభావితం చేయగలరన్న నమ్మకం జగన్ కు కలిగింది. ఇక బీద మస్తాన్ రావు.. బీసీ వర్గాలకు చెందిన నాయకుడే కాకుండా ఆయన పార్టీకి కొంత ఫైనాన్స్ కూడా చేయగలడని విశ్వసిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి రేగకుండా చూసుకునేందుకే ఇద్దరు రెడ్లకు టికెట్లిచ్చారు. పైగా నిరంజన్ రెడ్డి ఫిలిం ప్రొడ్యూసర్.. డబ్బులు బాగానే ఉన్నాయి విజయసాయి రెడ్డి ఫండ్ రైజర్ గా కూడా పనిచేయగలరు, ఎక్కడైనా డబ్బులు పట్టుకురాలగలరు..
మహిళలేరీ…
ఈసారి మహిళలకు అవకాశమే ఇవ్వలేదు. హోం మంత్రి పదవినే మహిళకు ఇచ్చామని చెప్పుకునే వైసీపీ.. రాజ్యసభ విషయంలో మాత్రం ఎందుకో ఆసక్తి చూపలేదు. ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యం దక్కలేదు. మరోసారి వారికి గ్యారెంటీగా ఇస్తామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బ్రాహ్మణ, వైశ్య, కమ్మ సామాజిక వర్గాలు తమకు అవసరం లేదన్నట్లుగానే జగన్ ప్రవర్తిస్తున్నారు. అందుకే రాజ్యసభ సీట్ల విషయంలో వారిని పట్టించుకోలేదని చెబుతున్నారు…