పవన్ కు బాబు మద్దతు..వైసీపీ ఆగ్రహం

By KTV Telugu On 25 October, 2022
image

విశాఖలో రాజకీయ రగడ
రాజధాని.. జనవాణి రచ్చ
ఊహించినట్టే విశాఖలో ఉద్రిక్తతలు
మంత్రుల కార్లపై దాడి, జనసైనికుల అరెస్ట్ లతో..
వేడెక్కిన రాజకీయ వాతావరణం
పవన్ కు మద్దతుగా బాబు స్టేట్ మెంట్
మండిపడుతున్న వైసీపీ నేతలు

విశాఖపట్నం రణరంగంగా మారింది. వైసీపీ గర్జన రోజే పవన్ కల్యాణ్ విశాఖ టూర్ పెట్టుకోవడంతో…ముందు నుంచి ఏదో జరగబోతుందనే ఊహగానాలు వినిపించాయి. అనుకున్నట్టుగానే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంత్రుల కార్లపై దాడి, పలువురు జనసైనికుల అరెస్ట్ తో రాజకీయం వేడెక్కింది. విశాఖ గర్జన ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో కొందరు మంత్రులపై రాళ్ల దాడి జరిగింది. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన దాడితో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలు దాడి చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా… వైసీపీ నేతలే దాడి చేయించుకున్నారని జనసేన ఎదురుదాడికి దిగింది.

ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ బస చేసిన విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో పోలీసుల తనిఖీలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ పలువురు జనసేన నేతలు, కార్యకర్తల అరెస్ట్ లతో రాజకీయం వేడెక్కింది. ఇక, పవన్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు జనవాణి ప్రాంగణం సమీపంలో గో బ్యాక్ నినాదాలు చేయడం…తమ అధినేతకు మద్దతుగా జనసేన కార్యకర్తల స్లోగన్ లతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈనేపథ్యంలో పవన్‌ జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా ఆంక్షలు విధించి పోలీసులు నోటీసులు అందజేశారు. తాము విశాఖ రాకముందే గొడవ జరిగితే..మేం వచ్చి రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగినట్లుగా నోటీసులివ్వడమేంటని జనసేనాని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో మరింత హీట్ పెంచేశాయి.

పవన్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రాజకీయం మరో మలుపు తిరిగింది. విశాఖలో ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఒక పార్టీ అధినేతగా ఆయన కారులో కూర్చోవాలా? లేదా బయటకు వచ్చి అభివాదం చేయలా? అనే విషయాలు కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పవన్‌ బసచేసిన హోటల్‌లో సోదాలు, బెదిరింపులు నియంత పాలనకు నిదర్శనం. విశాఖ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్టులు చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టారు. అరెస్టు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇవ్వడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రులపై జరిగిన దాడిని చంద్రబాబు ఖండించరు కానీ, జనసేన నేతల అరెస్ట్‌లను మాత్రం తప్పుబడతారని మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఆరోపించారు. ప్రజల సమస్యల కోసం జనవాణి పెట్టారా..? లేక చంద్రబాబు బాణిని చెప్పడానికి పెట్టారా? అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై పవన్ కక్ష కట్టారని, మూడు రోజుల కాల్షీట్ తీసుకుని విశాఖ వచ్చారని విమర్శించారు. రెండు రోజుల పాటు విశాఖలో పొలిటికల్ షూటింగ్ పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టించేందుకే పవన్ వచ్చారని… తాము అలాగే దాడులకు దిగితే మీరు తిరగగలరా అంటూ జనసేనానిపై నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు.