ట్రాఫిక్‌ పోలీసులపై ఓ వాహనదారుడి ఆగ్రహం

By KTV Telugu On 4 October, 2022
image

* బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న వ్యక్తిని ఆపిన హోమ్‌గార్డు
* ఆగ్రహంతో తన ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టిన బైక్‌ ఓనర్‌

ట్రాఫిక్‌ హోమ్‌గార్డు ఆపినందుకు ఆగ్రహించిన ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌.ఆర్‌ నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అశోక్‌ అనే వ్యక్తి ఎల్లారెడ్డిగూడ వైపు నుంచి వచ్చి రాంగ్‌ రూట్‌లో ఆదిత్య ఎన్‌క్లైవ్‌ వైపు వెళ్తుండగా అక్కడున్న ట్రాఫిక్‌ హోమ్‌గార్డు అశోక్‌ బైక్‌ను అపి రాంగ్‌ రూట్‌లో ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించాడు. అయితే తాను రోజూ ఇలాగే వెళ్తానని అశోక్‌ బదులివ్వడంతో హోమ్‌గార్డు బైక్‌ తాళం చెవి తీసుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతే పెట్రోలు తీసుకొచ్చి తన బైక్‌పై పోసి నిప్పటించాడు అశోక్. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అక్కడున్నవారందరూ హడలిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌ నగరంలో అక్టోబర్​ 3 నుంచి ట్రాఫిక్‌ రూల్స్‌ కఠినంగా అమలు చేయబోతున్నామని జాయింట్​ కమిషనర్​ రంగనాథ్​ ఇదివరకే చెప్పారు. . ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే వంద రూపాయలు ఫైన్ వేస్తారు.
పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే ఫుట్‌పాత్‌లను ఆక్రమించినవారికి భారీ జరిమానా విధిస్తారు. పోలీసులు చెప్పినవిధంగానే మూడవ తేదీ ఉదయం నుంచి నగరంలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ట్రాఫిక్‌ నిబంధనలపై ముందుగా వాహనదారులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.