రాజకీయ నాయకులు, క్రిమినల్స్ ఒకటైతే సామాన్యులకు కష్టాలు తప్పవా ? బిల్కిస్ బానో కేసు నిందితులంటే ఆ ఊరి జనం ఎందుకు భయపడుతున్నారు ? స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ బాధితులకు భద్రత కరువైందా ? గుజరాత్ లో ఇప్పుడేం జరుగుతోంది ?
గోధ్రా దహనకాండ తర్వాత 2002లో గుజరాత్ రావణకాష్టమైంది. అనేక చోట్ల అల్లర్లలో వందలాది మంది చనిపోయారు. రంధిక్ పూర్ గ్రామంపై కొందరు దుండగులు దాడి చేసి.. బిల్కిస్బానోపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ఏడుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయగా.. వారికి 2008లో యావజ్జీవ ఖైదు విధించారు. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను ధృవీకరించింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత సత్ప్రవర్తన పేరుతో పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని, కొంతమంది ఖైదీల శిక్షను రద్దు చేసి లేదా తగ్గించి, మూడు విడతలలో వారిని విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర హోంశాఖ జూన్ 10న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎటువంటి ఖైదీలను ఎప్పటికీ క్షమించకూడదో కూడా ఆ లేఖలో వివరించింది. జీవిత ఖైదు పడినవారిని, అత్యాచారాలకు పాల్పడినవారి నేరాలకు క్షమాపణ ఉండదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. నిబంధనలను తుంగలో తొక్కిన గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది.
శిక్షను మాఫీ చేసి.. నిందితులను విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వ వివరణ మరోలా ఉంది. 1992లో ఉన్న పాలసీ ప్రకారం యావజ్జీవ ఖైదు పడిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత విడుదలకు దరఖాస్తు చేసుకుంటే వారిని వదిలేసే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంటోంది. దాని ప్రకారం సుప్రీం కోర్టులో దోషుల తరరపున వేసిన పిటీషన్ ఆధారంగా కోర్టు అనుమతి మేరకే వారిని విడుదల చేసినట్లు తెలిపింది. ఖైదీల అరెస్టు సమయంలో ఉన్న చట్టాలే వారి విడుదలలోనూ అమలవుతాయని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.రేపిస్టులను విడుదల చేసిన కొద్ది గంటలకే వారికి సినీ హీరోల స్థాయిలో స్వాగతం లభించింది. నుదుట తిలకం దిద్ది, దండలు వేసి హారతిచ్చి ఊళ్లోకి తీసుకొచ్చారు. వాళ్లు ఇప్పుడు యథేచ్చగా తిరుగుతూ బాధితులను భయపెడుతున్నారు. దీనితో కొందరు వెళ్లి 11 మంది ఖైదీల విడుదలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిల్ వేశారు.
ఖైదీల విడుదలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 75వ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను మరిచి రేపిస్టులను విడుదల చేశారని ఆరోపణలు సంధించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఖైదీల విడుదలపై స్పందించారు. రేపిస్టులకు దండలేసి స్వాగతం పలకడమేంటని నిలదీశారు. నేడు బిల్కినాకు జరిగినదే రేపు ఎవరికైనా జరగొచ్చని అయన గుర్తుచేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేశామని, 45 రోజుల తర్వాత మాత్రమే హైకోర్టు వారికి బెయిల్ వచ్చిందని ఆయన చెప్పారు. రేపిస్టులు జీవితకాలం జైల్లో ఉండే విధంగా చట్టాలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మరో పక్క ఖైదీల విడుదలతో భయంలో మునిగిపోయిన బాధితులు భద్రత కోసం మళ్లీ రిలీఫ్ కాలనీకి వెళ్లిపోయారు. 2002లో హింసాసాండ జరిగినప్పుడు ప్రభుత్వం వారిని సహాయ శిబిరాల్లో ఉంచింది. నిందితులకు యావజ్జీవ శిక్ష పడిన తర్వాత వాళ్లు సొంతూరుకు వచ్చారు. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు మళ్లీ శిబిరాలకు చేరుకున్నారు.