చాలా ఏళ్ల తరువాత సొంత గూటికి చేరిన రాములమ్మ, తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. పార్టీ సమావేశాలు, సభలు ఎక్కడ జరిగినా, ఆమె మాట వినిపించడంలేదు. మీడియా సమావేశాల్లో కూడా రాములమ్మ కనిపించకపోవడంతో.. తెలంగాణ బిజెపిలో ఏదో జరుగుతోందన్న వార్తలు జోరందుకున్నాయి. రాములమ్మ కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారా ? రాష్ట్ర నాయకత్వమే ఆమెను పక్కన పెట్టిందా ? అసలు తెలంగాణ బిజెపిలో ఏం జరుగుతోంది ?
తెలంగాణ బిజెపిలో రాములమ్మ పాత్ర చిన్నగా అయిపోయింది. ఒకప్పుడు సినిమాలు, ఆ తరువాత రాజకీయాలను ఒక ఊపు ఊపిన విజయశాంతి ఎందుకో సైలెంట్ అయ్యారు. చాలా కాలం తరువాత సొంత గూటికి చేరిన విజయశాంతి, ఆశించిన స్థాయిలో రాజకీయం చేయడంలేదు. బిజెపి సమావేశాలు, సభలు ఎక్కడ జరిగినా ఆమె సరిగ్గా పాల్గొనడంలేదు. పాల్గొన్నా మైకు పట్టి తన వాయిస్ ను వినిపించడంలేదు. దీంతో బిజెపిలో ఆమె పాత్రమై రకరకాల వార్తలు వస్తున్నాయి. విజయశాంతిని రాష్ట్ర నాయకత్వం కావాలనే దూరం పెడుతోందనే ప్రచారం జరుగోంది. అదీగాక రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
విజయశాంతి 1998లో బిజెపిలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005 వరకు బిజెపిలోనే కొనసాగారు. ఆ తరువాత ఆ పార్టీ నుండి బయటికి వచ్చి, అదే సంవత్సరంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009 వరకు ప్రత్యేక తెలంగాణ కొరకు పార్టీని నడిపించారు. 2009లో పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేసి, మెదక్ ఎంపీగా గెలిచారు. ఆ తరువాత అనుకున్న స్థాయిలో, తెలంగాణ రాజకీయాల్లో తన పాత్రను పోషించలేదు. క్రమంగా ఆమె టిఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరి, కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీలో కూడా రాములమ్మ పొసగలేక, 2020 డిసెంబర్ లో మళ్లీ బిజెపిలో చేరారు.
దాదాపు 15 ఏళ్ల తరువాత సొంతగూటికి చేరిన తరువాత విజయశాంతిపై, బిజెపిలో భారీ అంచనాలు పెరిగాయి. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాములమ్మ పాత్ర కీలకమని బిజెపి భావించింది. అయితే గత కొన్ని నెలలుగా విజయశాంతి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఊంటూ వస్తోంది. పార్టీ సభలు, సమావేశాల్లో పాల్గొనకపోవడం, పాల్గొన్నా తన వాయిస్ ను వినిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. అయితే ఈ విషయంపై, ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానం మరిన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించినట్లైంది. తెలంగాణ బిజెపిలో ఏందో జరుగుతోందన్న ప్రచారానికి విజయశాంతి మాటలు బలాన్ని చేకూర్చాయి. కానీ ఆమె మాట్లాడిన తీరు ద్వందార్థాలను సూచిస్తోంది. కరోనా వంటి అనారోగ్య కారణాల వల్ల గత కొన్ని రోజులగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. కానీ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నలకు, అలాంటిదేదీ లేదనకుండా.. రాష్ట్ర నాయకత్వాన్ని మీరే అడగండి అంటూ సూచించారు. ఈ మాటలు మీడియా ఎక్కువ ఊహించుకుంటోందన్న భావనతో అన్నారా ? లేక నిజంగానే ఆమెను దూరం పెడుతున్నారన్న బాధతో చెప్పారా ? అని అంతా చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి రాములమ్మ రాజకీయ జీవితం చాలా ఒడిదొడుకులతో కూడుకుంది. ఎవ్వరూ ప్రత్యేక తెలంగాణ గొంతును వినిపించేందుకు ముందుకు రాని సమయంలో.. సొంత పార్టీ పెట్టి, తెలంగాణ సమాజం వైపు బలంగా నిలబడింది. అనుకోని పరిస్థితుల్లో ఒకే సిద్ధాంతం ఉన్న టిఆర్ఎస్‌లో పార్టీని విలీనం చేసింది. ఎంటైర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, సినిమాల నుండి వచ్చి పార్టీ పెట్టిన రెండో వ్యక్తి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. తన యాక్షన్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ చాలా బలంగా చూపించారు. కానీ టిఆర్ఎస్ లో చేరిన తరువాత ఆమె కెసిఆర్ రాజకీయ చదరంగంలో బలయ్యారని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావం గల మహిళా నేతల్లో ఆమె ముందు వరుసలో ఉంటారు. రాములమ్మ ఇమేజ్ ను బిజెపి సరిగ్గా వాడుకోవడంలేదన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా రాములమ్మ రానున్న రోజుల్లో తెలంగాణ బిజెపిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కానీ తెలంగాణ బిజెపిలో అంతర్గత కలహాలు ఉన్నాయన్న ప్రచారంపై, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి క్లారిటీ ఇస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇది ఇలాగే కొనసాగితే కచ్చితంగా పార్టీ నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.