కారు దిగిన బూర

By KTV Telugu On 23 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకోడానికి సిద్దమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక టికెట్ ఆశించినప్పటికీ ఆయన ప్రయత్నాలు టీఆర్‌ఎస్‌ అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. దాంతో బూర బీజేపీలో చేరబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఒకవైపు కేసీఆర్‌ బీఆర్ఎస్ అంటూ.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్న సమయంలో….కేసీఆర్‌ మీద టీఆర్‌ఎస్‌ నాయకులకే నమ్మకం లేదని ప్రచారం చేయడానికి నర్సయ్యగౌడర్ చేరిక బీజేపీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మునుగోడులో ఈ విషయాన్ని ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలనేది బీజేపీ ఆలోచన. నిజానికి బూర నర్సయ్య గౌడ్ కు మొదటి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశ. 2014లో టీఆర్‌ఎస్‌ తరపున భువనగిరి నుంచి ఎంపీగా నెగ్గినప్పటికీ..ఎమ్మెల్యే పదవి మీద ఆసక్తిని వదలుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం బాగానే ట్రై చేశారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. మునుగోడు ఉప ఎన్నిక ముంచుకురాగానే.. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. అదేమీ ఆయన సొంత నియోజకవర్గం కాదు. అయినప్పటికీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో కేసీఆర్‌ మీద అలిగి బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బిజెపిలో చేరి.. మునుగోడులో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తే వచ్చే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లో భువనగిరిలోనో, ఆలేరులోనో, లేదంటే నల్గొండజిల్లాలో మరేదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయవచ్చనేది బూర ఆలోచన.