ఆ తమిళ్ తంబికి డబుల్ ధమాకా ఖాయమా ?

By KTV Telugu On 20 May, 2022
image

పగ, ప్రతీకారం.. కక్ష.. కార్పణ్యం.. ఏసెయ్యండ్రా అని మొహమాటం లేకుండా ఆదేశాలిచ్చే కసి.. ఈ ఇద్దరు నేతల మధ్య చాలా రోజులుగా రగులుతోంది. తమిళ తంబికి, గుజరాత్ మోటా బాబుకూ మధ్య దశాబ్దాల వైరం అవసరమైనప్పుడల్లా బయట పడుతోంది. ఛాన్సొస్తే, ఛాన్సిస్తే కటకటాల్లోకి నెట్టాలన్న కోరిక నాయకుల మధ్య హాబీగా మారిందన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికే తమిళ తంబిని ఓ సారి అరెస్టు చేసిన బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం సెకండ్ రౌండ్ కోసం రెడీ అవుతున్నట్లుగా తాజా పరిణామాలు ప్రత్యేకంగా చెప్పకనే చెబుతున్నాయి.

 

నాలుగు రోజుల క్రితం వన్ ఫైన్ మార్నింగ్… కేంద్ర మాజీ మంత్రి .. కాంగ్రెస్ నేత చిదంబరం నివాసాలపై సీబీఐ విరుచుకుపడింది. ఢిల్లీ, చెన్నై, ముంబైలో తొమ్మిది చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇంతకీ సీబీఐ ఆఫీసర్లు ఎందుకు దూసుకొచ్చారో తెలుసుకునేందుకు కొంత సమయం పట్టింది. పి, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై దాఖలైన ఎఫ్ఐఆర్ కు సంబంధించి సీబీఐ సోదాలు నిర్వహించింది.

2011లో రూ. 50 ల‌క్ష‌ల ముడుపులు స్వీక‌రించి 250 మంది చైనా జాతీయుల‌కు వీసాల‌ను ఏర్పాటు చేశార‌ని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబ‌రంపై సీబీఐ తాజాగా కేసు న‌మోదు చేసింది. అంటే 11 ఏళ్ల క్రితం వ్యవహారమన్నమాట.  మ‌రోవైపు ఐఎన్ఎక్స్‌, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులోనూ కార్తీ చిదంబ‌రంపై సీబీఐ ప‌లు అభియోగాలు ముందే మోపింది. సీనియర్ చిదంబరానికి వీసా కేసుతో ఉన్న లింకులు వెదికేందుకే సీబీఐ సోదాలు నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకున్న సోదాలు చేశారని, సీబీఐ తన ఇంట్లోకి దూరిపోయిందని చిదంబరం ఆరోపించారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు స్వాధీనం కాలేదని కూడా ఆయన వెల్లడించారు…

 

చిదంబరం అరెస్టు

 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని 2019 ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చిదంబరాన్ని వెంబడించి, వేటాడి.. చివరకు ఇంటి గోడ దూకి, తలుపులు బద్దలు కొట్టి రాత్రి పూట అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ రూ. 305 కోట్ల విదేశీ నిధులు తెచ్చుకునేందుకు ఎఫ్ఐబీపీ క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో అవకతవకలు జరిగాయని సీబీఐ ఛార్జ్ షీటు వేసింది. 106 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పొంది అదే ఏడాది డిసెంబరు 4న ఆయన విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం చిదంబరం తీవ్ర నేరానికి పాల్పడ్డారని తేల్చింది. బీజేపీకి కావాల్సింది కూడా అదే కదా…

 

పాతకక్షలు – అరెస్టులు

 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షాను  చిదంబరం అరెస్టు చేయించారని.. ఇప్పుడు అదే అధికారంతో చిదంబరాన్ని షా అరెస్టు చేయించారని చెబుతుంటారు చర్యకు ప్రతిచర్య జరిగిందని చెబుతుంటారు. యూపీఏ పాలన.. 2008 నవంబరు 29 నుంచి 2012 జూలై 31 వరకు చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోద్రా అల్లర్లు, సహా పలు ఎన్‌కౌంటర్లకు బాధ్యుడిని చేస్తూ మోదీని ఇరికించే ప్రయత్నం చిదంబరం చేశారని అప్పట్లో బీజేపీ ఆరోపించింది. సీఎంపై నేరం మోపడం కదురని తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను అరెస్టు చేశారని విశ్లేషణలు వినిపించాయి.

సోహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, సహాయకుడు తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ల కేసును చిదంబరం స్వయంగా తవ్వితీశారు. పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దానికి అమిత్‌ షా పథకం రచించారని సీబీఐ 2010లో అభియోగాలు మోపింది. 2010 జూలై 25న అమిత్‌ షాను ఈ కేసులో అరెస్టు చేశారు. హత్య, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌ అభియోగాలు మోపారు. స్వతహాగా లాయరైన చిదంబరం ఈ చార్జిషీటును పరిశీలించి పలు మార్పులు చేర్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మంత్రి పదవికి రాజీనామా చేసిన అమిత్ షా.. మూడు నెలలు జైలులో ఉన్నారు. 2010 అక్టోబరు 29న బెయిల్ ఇచ్చిన గుజరాత్‌ హైకోర్టు.. రెండేళ్లపాటు గుజరాత్‌లో షా అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది. దానితో  ఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లోని ఒక గదిలో రెండేళ్లపాటు ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.

 

ఇప్పుడేంటీ..

అరెస్టయి, బెయిల్ పొందిన తర్వాత చిదంబరంలో కసి మరింతగా పెరిగింది. ప్రభుత్వంపై విమర్శల వేడి పెంచారు. ఆర్థిక అంశాల్లో తనకున్న మంచి పరిజ్ఞానంతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఉదయ్ పూర్ చింతన్ బైఠక్ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై చిదంబరం వాగ్బాణాలు సంధించారు. ద్రవ్యోల్బణం పెరగిపోతోందని, ధరాఘాతంతో పేదలకు పట్టెడన్నం దొరకడం లేదని చిదంబరం అన్నారు. ఇండియాను కూడా శ్రీలంక స్థాయికి దిగజారుస్తున్నారన్నారు. ఆయన మాట్లాడి వారం తిరగకముందే ఇంటి ముందు సీబీఐ ప్రత్యక్షమైంది. ఇప్పుడు చిదంబరాన్ని పీకల్లోతు కష్టాల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. చిన్న ఆధారం దొరికినా వెంటనే ఆరెస్టు చేస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం. దేశంలో డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉందని గట్టిగా చెప్పలేం. చిదంబరానికి మాత్రం డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది…