తెలంగాణా సంస్కృతిని ప్రతిబింభించే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఎప్పటి నుండో వేచి చూస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వాహించే బండారు దత్తాత్రేయ దృష్టిలో ఎప్పుడు పడతానా… ఎప్పుడు తనకు ఆహ్వానం వస్తుందా అని ఎదురుచూసేవాడిని…ఆ అవకాశం ఇప్పుడొచ్చింది అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన చిరంజవి మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుండటం మాములు విషయం కాదు అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవకాశం నాకు కల్పించిన దత్తాత్రేయగారికి, వారి కుమార్తెకు.. అందరికీ ధన్యవాదాలు.. అని చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి.. వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను బండారు దత్తాత్రేయ ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్, మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రామ్ చందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వి. హనుమంతరావు, చిరంజీవి డప్పు కొట్టి అభిమానులను అందరినీ అలరించారు.