మెగా స్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలమవుతారా.. ఆయన ఆ డైలాగ్ ఎందుకు వదిలారు .. సినిమా ప్రమోషనా… నిజంగా రాజకీయమా… చిరంజీవి ఆలోచన ఏమిటి ?
….
నిన్నమొన్నటి దాకా రాజకీయాల్లో ఉన్న చిరంజీవి మళ్లీ రావాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. సొంతపార్టీ పెట్టకపోయినా ఏదోక పార్టీలో చేరి ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి చేసిన ఒక ఆడియో ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చకు తెరతీసింది. చిరంజీవి చేసిన వాయిస్ ట్వీట్ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో.. నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు అని అన్నారు. నిజానికి ఇదీ చాలా పవర్ ఫుల్ డైలాగ్. అన్ని రకాలుగా విశ్లేషించుకోవాల్సిన, విశ్లేషించుకుంటున్న అంశం.
చాలా కాలంగా చిరంజీవి నోట రాజకీయాలు రాలేదు. ఇటీవలి కాలంలో ఇదే తొలి డైలాగ్ అవుతుంది. చిరంజీవి డైలాగ్ ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు.. సినిమా రంగంలోనూ చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి నెక్ట్స్ రిలీజ్ గాడ్ ఫాదర్ రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా. మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్. ఆ సినిమా లో చిరంజీవి పవర్ ఫుల్ పాత్ర పోషించారు. నేరుగా రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాలను శాసించే రోల్ అది . అలాంటి క్యారెక్టర్ కోసం రాసిన డైలాగ్ ను పబ్లిసిటీగా జనంలో వదిలి ఉంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్. టీజర్లో రాజకీయ ప్రస్తావన ఉంటే ఆ పబ్లిసిటే వేరప్పా అంటున్నారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చిరంజీవి చాలా సార్లు ప్రకటించారు. అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం తరచూ చిరంజీవి ప్రస్తావన వస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లిన తరవాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. రాజ్యసభ టికెట్ ఇస్తున్నట్లు కూడా కొందరు గాలి కబుర్లు వదిలారు. ఆ వార్తలను చిరంజీవి అప్పుడే ఖండించారు. పవన్ కల్యాణ్ ను విమర్శించే వైఎస్ఆర్సీపీ నేతలు చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తూంటారు. పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించేటప్పుడు ఖచ్చితంగా చిరంజీవి ప్రస్తావన తెస్తారు. అన్నకు వెన్నుపోటు పొడిచారంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇలా తనను రాజకీయాల్లోకి పదే పదే తీసుకు వస్తూండటంతో… క్యాచీగా ఉంటుందని ఈ డైలాగ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. వైసీపీ నేతలను ఆయన పరోక్షంగా హెచ్చరించారని కూడా అనుకోవాలి. చిరంజీవి ఇక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటారు. అయినా మీడియాలో మాత్రం వార్తలు వస్తూనే ఉంటాయి. అన్నింటికీ చిరంజీవి మాత్రం మౌనమే సమాధానమంటారు. ఈ సారి మాత్రం ఆయనే పోస్ట్ చేసిన ఆడియో కావడంతో చిరంజీవి స్వయంగా స్పష్టతనిస్తారాన్న చర్చ జరుగుతోంది. ఏం చేస్తారో చూడాలి.. అయినా పదవి ఎవరికీ చేదు కాదుగా.