* ఏపీలో అధికార, ప్రతిపక్షాల సోషల్ వార్
* రాజకీయ విమర్శలు..పర్సనల్ అటాకింగ్స్
* వైసీపీ టార్గెట్ గా ఐటీడీపీ పోస్టులు
* భారతీపే పోస్టుతో సీఐడీకి దొరికిన విజయ్
* నోటీసులతో రెండు పార్టీల మధ్య విమర్శల పర్వం
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్ యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తోంది. ప్రభుత్వ బలహీనతలను ఎత్తిచూపుతూ టీడీపీ, తెలుగుదేశం తప్పిదాలను చూపిస్తూ వైసీపీ పోటాపోటీ పోస్టులతో సామాజిక మాధ్యమాల్లో మాటల దాడి చేసుకుంటున్నాయి. అది ఏ స్థాయిలో సాగుతుందంటే…రాజకీయ విమర్శలతో మొదలై పర్సనల్ అటాకింగ్స్ వరకూ వెళ్తోంది. రాజకీయాలతో ఏ సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్లను సైతం లాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా సెకన్ల వ్యవధిలో పోస్ట్ పెడుతూ వైరల్ చేస్తున్నారు. అంతలా రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ జరుగుతోంది.
ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలోకెల్లా వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సోషల్ ప్రచారం బాగా ప్లస్ పాయింట్ అయింది. ఆ పార్టీ డిజిటల్ మీడియాకు తోడుగా కరడుగట్టిన వైసీపీ వాదులు సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ…ప్రత్యర్థిని ఇరుకున పెడుతుంటారు. వారితో పాటు ఐప్యాక్ టీమ్ వైసీపీకి పనిచేయడంతో జగన్ పార్టీ 2019లో అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగింది. టీడీపీకి సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు దాని ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే, ప్రతిపక్షంలోకి వచ్చాక…. తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని ఇరుకునపెట్టే పోస్టులు పెట్టడం ద్వారా దూకుడుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఐటీడీపీ అధికార పార్టీకి కంటగింపుగా మారిపోయింది.
సీఎం జగన్ సతీమణి భారతిపై పెట్టిన పోస్టు వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇవ్వడం ద్వారా… తెరపైకి వచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్. టీడీపీ అధికారంలో ఉన్నప్పటినుంచే ఐటీడీపీని నడిపిస్తోంది. ఐటీ నిపుణుడైన విజయ్ కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటూ టీడీపీ సోషల్ మీడియా వ్యూహాల్లో కీలకంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేసినా అప్పట్లో వైసీపీ హవా కారణంగా వెలుగులోకి రాలేకపోయారు. టీడీపీ విపక్షంలో ఉన్న ఈసమయంలో విజయ్ పేరు మార్మోగుతోంది. ఐటీడీపీ ద్వారా పంపుతున్న పోస్టులనే టీడీపీ స్ధానిక క్యాడర్ జనంలోకి షేర్ చేస్తోంది. ఇది వైసీపీకి కొరకరాని కొయ్యగా మారుతోంది. తెరవెనుక ఉండి వైసీపీని టార్గెట్ చేస్తున్న చింతకాయల విజయ్.. ఈసారి భారతీపే పోస్టుతో సీఐడీకి దొరికారు. చింతకాయల విజయ్ ను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ దూకుడుకు కొంతమేర అడ్డుకట్ట వేయొచ్చనేది వైసీపీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో సీఎం, ప్రభుత్వ విధానాలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడం ద్వారా కేసులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే పోస్టులకు తాము వ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు దారుణంగా ఉంటున్నాయని హైకోర్టు మండిపడింది. గతేడాది వైసీపీ వర్సెస్ హైకోర్టుగా సాగిన పోరులో గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తుల్ని, వారి తీర్పుల్ని తప్పుబడుతూ సోషల్ మీడియా పోస్టులు వెలిశాయి. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు కావడంతో పాటు అరెస్ట్ లు జరిగాయి.