* కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మర్నాడే అవార్డులు వస్తున్నాయి : కేసీఆర్
* ఆ పథకానికి తాము ఎలాంటి అవార్డు ఇవ్వలేదన్న కేంద్రం
కేంద్ర మంత్రులు తెలంగాణాకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టిపోయిన మర్నాడే రాష్ట్రానికి పలు రంగాల్లో పలు అవార్డులు వస్తున్నాయి అని అన్నారు సీఎం కేసీఆర్. శనివారం హన్మకొండలో ప్రతిమ వైద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై మండిపడ్డారు. మోదీ సర్కారు తమపట్ల వివక్ష చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణదే ప్రథమ స్థానమని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మర్నాడే అవార్డులు ఇస్తారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు, కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్తం అవార్డులు ప్రకటించింది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కూడా రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణాను కేంద్రం గుర్తించిందని వార్తలొచ్చాయి. ఈ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు మచ్చుతునక అని
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, హరిశ్రావ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి జలక్ ఇచ్చింది. తాము మిషన్ భగీరథ పథకానికి ఎలాంటి అవార్డు ఇవ్వలేదని కేంద్ర జల శక్తి శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో వంద శాతం ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు అన్ని గ్రామ పంచాయితీలు తీర్మానం చెయ్యాలి…కానీ అలాంటి తీర్మానం ఏమీ తమకు రాలేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మిషన్ భగీరథ పథకాన్ని తాము పరిగణలోకే తీసుకోలేదని వివరించింది. ఇక
ఇప్పుడు ఈ అవార్డు విషయంపై తెలంగాణ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.