ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ విజయంలో అత్యంత కీలకమైనది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం తీసుకు రావాలని… ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి ఇచ్చిన తాయిలాల్లో భాగంగానే.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ మూడేళ్లయింది. ఇప్పటికీ రద్దు చేయలేదు. చేయడానికి దారులు కూడా కనిపించలేదు. కానీ ఉద్యోగులు మాత్రం రోడ్డెక్కుతున్నారు.
సీపీఎస్ రద్దు ఆషామాషీ కాదు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయినా సీపీఎస్ రద్దు చేయాలంటే.. కచ్చితంగా కేంద్రం సహకారం ఉండాలి. ఎందుకంటే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మొత్తం.. కేంద్రంతో ముడిపడి ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ యాక్ట్ కు 2013 ఆగష్టులో చట్టం అయింది. చట్టం కాక ముందు నుంచీ సీపీఎస్ అమల్లో ఉంది. అయితే అన్ని రాష్ట్రాలనూ ఇందులో భాగం చేయలేదు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు చేరవచ్చని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు మాత్రమే చేరలేదు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత సీపీఎస్‌లో ఆ రాష్ట్రం కూడా చేరింది. ఏపీ కూడా ఇష్టపూర్వకంగానే సీపీఎస్‌లో చేరింది.
భరించలేనంత ఆర్థిక భారం పడుతుంది !
ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయి. సీపీఎస్ అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి బయటకు రావాలంటే చాలా ఆర్థిక భారం పడుతుంది. బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పటికీ… నిధుల విత్‌డ్రాలో అనూహ్యమైన, అవాంఛనీయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాతీయ పెన్షన్ పథకం ట్రస్టు కమిటీది కూడా అదే అభిప్రాయం. సీపీఎస్ నుండి బయటకు రావడానికి అవకాశాలను పరిశీలించేందుకు కేరళ ప్రభుత్వం కమిటిని ఏర్పాటు చేసింది. ఏపీ సర్కార్ కూడా కమిటీ వేసింది. ఆర్థిక భారం వేసుకుని.. ఉద్యోగులకు కొత్త ప్రయోజనాలు కల్పించి… సీపీఎస్ రద్దు చేయలేకపోతున్నాం.. దానికి అనుగుణంగా ప్రయోజనాలు కల్పిస్తామని సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి చివరికి రావడం ఖాయమంటున్నారు.
తెలియక హామీ ఇచ్చారని బయటపడే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం !
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ గురించి తెలియకుండానే సీఎం జగన్ హామీ ఇచ్చారని ఓ ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయన్నారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి… వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ప్రకటించారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్నీ సజ్జల చేతుల మీదుగానే నడుస్తున్నాయి కాబట్టి ఆయన మాటలు అధికారికం అనుకోవాలి.
ఉద్యోగుల ఆవేశం తగ్గించడానికి చర్చల మాటలు !
సీపీఎస్ రద్దు చేయకపోతే తఢాఖా చూపిస్తామని ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ఖరారు చేసుకున్నాయి. సీఎం ఇంటిముట్టడికి కూడా సిద్ధమవుతున్నారు. సమావేశాలు.. కమిటీలతో టైం పాస్ చేయాలని ఏపీ ప్రభుత్వం వ్యూహం పాటిస్తోంది. కానీ ఉద్యోగం ఆవేశం కట్టలు తెగితే మాత్రం ఇబ్బంది పడాల్సిందే.