మరింత దూకుడు పెంచిన ఈడీ
అప్రూవర్‌గా మారిన ఢిల్లీ డిప్యూటీ సీఎం ఫ్రెండ్
తెలంగాణలో కీలక నేత అరెస్ట్ తప్పదా?
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ టూ తెలంగాణ, ఆంధ్రా వరకు సాగిన మద్యం కుంభకోణం వ్యవహారంపై తీగ లాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాధా ఇండస్ట్రీస్ చైర్మెన్ దినేష్ అరోరా అప్రూవర్‌గా మారడంతో మందు వ్యాపారుల డొంక అంతా కదులుతోంది. ఏపీకి చెందిన ఓ ప్రముఖ ఎంపీ సమీప బంధువైన అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరికి కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు గుర్తించింది. ఈక్రమంలోనే శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించిన అధికారుల అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
శరత్ చంద్రారెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. ప్రధానితో విజయసాయిరెడ్డికి మంచి ర్యాప్ ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలను ఎప్పుడంటే అప్పుడు కలిసేంత పలుకుబడి సంపాదించారు. వైసీపీకన్నా బీజేపీతోనే సాయిరెడ్డి ఎక్కువగా సన్నిహితంగా ఉంటారని అంటారు. అయినా అతని అల్లుడిని లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ఎవరిని వదిలే పట్టే ప్రసక్తే లేదని కేంద్రం సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో కీలకనేత అరెస్ట్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటకు వచ్చాయి. తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కీలకంగా ఉన్నారని తేలింది. ఈ కేసును ఈడీ సీరియస్ గా తీసుకోవడం వెనుక తెలంగాణ సర్కార్ లక్ష్యంగా కేంద్రం పావులు కదపడమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో త్వరలోనే సంచలనాలు జరగబోతున్నాయని చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో విజయసాయిరెడ్డి లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టయిన వారు ఎవరికి దగ్గరవారు. శరత్ చంద్రారెడ్డి ఎవరి మనిషి? అరవిందో ఎవరిది? అంటూ బీజేపీ నేత పురంధేశ్వరి ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో దసపల్లా భూముల కుంభకోణం మీద సీబీఐ,ఈడీలకు ఫిర్యాదు చేస్తామంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రజలు ఎవరూ వీటిలో ప్లాట్లు కొనవద్దని సీఎం రమేష్ సూచించారు. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను విజయసాయిరెడ్డి తన కూతురు, అల్లుడికి దోచిపెట్టారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆమాద్మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కాషాయపార్టీ. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు సన్నిహితుడైన దినేశ్ అరోరా లిక్కర్ లోగుట్టు అంతా బయటపెట్టడంతో త్వరలోనే మరికొన్ని అరెస్ట్‌లు ఉండవచ్చని తెలుస్తోంది.