– ఈడీ వేడి..లిక్కర్ స్కామ్ జీడి!
– కేజ్రీవాల్ కొంపముంచేదాకా కెలకాల్సిందే!
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఒకప్పుడు మొగిలిరేకులు, ఇప్పుడు కార్తీకదీపంలా ఇది కూడా ఓ అంతులేని కథ. ముగింపు తెలీని రొద. ఎందుకంటే సిసోడియానుంచి మొదలుపెట్టిన తనిఖీలు చివరికి ఎవరెవరి చుట్టో తిరుగుతున్నాయి. ఎప్పుడూ పెగ్గేసి ఎరగనివారిని కూడా లిక్కర్ కంపులోకి లాగుతున్నాయి. చివరికి కేసీఆర్ కూతురు కవిత కూడా ఈ ఎపిసోడ్లో ఓ అతిథి పాత్ర పోషించింది. కాకపోతే మెరుపుతీగలా అలా కనిపించి ఇలా మాయమైంది.
లిక్కర్ స్కామ్‌లో కొండని తవ్వి ఎలుకని కూడా పట్టలేకపోయారని ఆప్ నేతలు దెప్పిపొడుస్తున్నారు. ఈడీ కూడా నిను వీడని నీడను నేనేనన్నట్లు వెంటాడుతోంది. గ్యాప్ రాలేదు తీసుకున్నామంతే అన్నట్లు దాడులతో బెంబేలెత్తిస్తోంది. సోదాలతో కూపీలాగుతోంది.
దేశవ్యాప్తంగా దాదాపు 35చోట్ల ఈడీ నిర్వహించిన సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ టూ హైదరాబాద్ ఎవరెవరి లింకులో దొరుకుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ వారిచ్చిన సమాచారంతో కొత్తచోట్ల దాడులు జరుపుతోంది.
ఢిల్లీలో డిప్యూటీ సీఎం సిసోడియా అనుచరుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. దినేష్ అరోరా ఇల్లు, ఆఫీసులు, ఆయన సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు స్టేట్మెంట్తో ఈడీ తీగలాగుతోంది. స్కామ్ సంపాదన మీడియా ఖాతాకి బదిలీ అయిందనే సమాచారంతో హైదరాబాద్‌లో ఆంధ్రప్రభ మీడియా హౌస్‌లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. కొండను తవ్వి పట్టింది ఎలుకలనే కావచ్చుగానీ కలుగుల్లోంచి పందికొక్కులు ఊపిరాడక బయటికొచ్చేలా ఉన్నాయి.