ఎన్నికల వేడిని రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.. కొత్త మైండ్ గేమ్ తో అధికార టీఆర్ఎస్ పై వత్తిడి పెంచుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ గేమ్ లో కెప్టెన్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారంటూ ఒక అయోమయ స్థితిని సృష్టించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అసలేం జరుగుతోంది…
ఈటల రాజేందర్ స్పీడ్ పెంచారు. బీజేపీలో బండి సంజయ్ వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అమలు జరిపితే .. పార్టీలో తానే నెంబర్ వన్ అవుతానని విశ్వసిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల్లో చాలా మంది తమ పార్టీ వైపు చూస్తున్నారని చెబుతూ…. ఒక మైండ్ గేమ్ కు తెర తీస్తున్నారు. ఆషాఢం మంచిది కాదని, శ్రావణామాసం రాగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్యూ కడతారని చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా క్రేజీ స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ నియోజవర్గం గజ్వేల్ లో పోటీ చేస్తానని సవాలు చేస్తున్నారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి హుజురాబాద్ లో పోటీ చేయాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని రాజేందర్ లెక్కలు కడుతున్నారు..
మహారాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని బీజేపీ ప్రచారం చేసింది. పొరుగు రాష్ట్రం తరహాలో ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకోవడం బీజేపీ గేమ్ ప్లాన్ ను చెప్పకనే చెప్పింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి కేసీయార్ కొడుకు, కూతురు,అల్లుడు ఎవరైనా ఏక్ నాథ్ షిండే కావచ్చంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అలాంటి ప్రకటనలు ఒక పది రోజులు విరామం ఇచ్చిన బీజేపీ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని రాజేందర్ అంటున్నారు. ఆగస్టు చివరి నాటికి చాలా మంది తమ వైపుకు వస్తారని చెప్పుకోవడంలో ఏదో మతలబు ఉందన్న చర్చ జరుగుతోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పీకే.. నివేదికలు సమర్పిస్తున్నట్లు సమాచారం. విజయావకాశాలు లేని వారిని కేసీఆర్ పక్కన పెట్టేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే వాళ్లు కొత్త గూడు వెదుక్కుంటున్నారని కొేందరి వాదన. జిల్లాలో ఉన్న నేతలు తమ అనుచరులను వెంట పెట్టుకుని కమండల తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. అలాంటి వాళ్లు 20 మంది వరకు ఉంటారని ఈటల రాజేందర్ లాంటి నేతలు చెబుతూ పాలి..ట్రిక్స్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వచ్చే వారిలో ఒక శక్తిమంతమైన నేతను ఏక్ నాథ్ షిండేగా మార్చే వీలుంటుందని బీజేపీ అంచనాలు వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే అది కేవలం రాజకీయ విశ్లేషణమాత్రమేననుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్ర పరిస్తితులు వేరు.. తెలంగాణలో వాస్తవ స్థితిగతులు వేరని గుర్తించాలి…
ఈటల బీజేపీలో చేరి చాలా రోజులైంది. తెలంగాణలో పార్టీ బాగా బలపడుతుందన్న విశ్వాసంలో ఈటలను చేర్చుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారే తప్ప తర్వాత ఆయన సాధించిందేమీ లేదు. పార్టీలో ఎక్కువ మందిని చేర్చాలన్న ఉద్దేశంతో ఈటలకు బీజేపీ అధిష్టానం చేరికల కమిటీ ఇంచార్జ్ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే కాంగ్రెస్ లో చేరినంత మంది కూడా బీజేపీలో చేరకపోవడంతో ఈటల సమర్థతపై జాతీయ నేతలకు అనుమానాలు మొదలయ్యాయి. బండి సంజయ్ మరో విడత పాదయాత్ర నిర్వహించే సమయంలో ఎక్కడికక్కడ చేరికలు చూపించాలని ఈటలకు టార్గెట్ పెట్టినట్లు సమాచారం. దానితో ఇప్పుడు మైండ్ గేమ్ ద్వాారా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ కొడుతూ తొలుత తమ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇలాంటి మైండ్ గేమ్స్ లో కేసీయార్ దిట్ట. డెడ్ లైన్స్ కూడా ఆయన బాగానే పెట్టగలరు. ఇప్పుడు అదే గేమ్ ప్లాన్ తో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. మరి బీజేపీ సక్సెస్ అవుతుందా.. అంటే చెప్పడం కష్టమే..