మనుగోడు కాంగ్రెస్‌ ఆఫీసులో మంటలు…24గంటలు టైమ్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి

By KTV Telugu On 11 October, 2022
image

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ప్రచారం కోసం సిద్ధంగా ఉంచిన జెండాలు, పోస్టర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం అయిదు లక్షల రూపాయల విలువైన ప్రచార సామాగ్రి కాలి బూడిదయ్యింది. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది తమను దెబ్బతీసేందుకు జరిగిన రాజకీయ కుట్ర అని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనను నిరసిస్తూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మంటలు చెలరేగడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని అన్నారు. తాము విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించామని, అది షార్ట్ సర్క్యూట్ కాదని వారు తేల్చారని వివరించారు. కచ్చితంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని చూసి రెండు ప్రధాన పార్టీలు భయపడుతున్నాయని, ఇది ఆ రెండు పార్టీల కుట్రేనని అన్నారు. ప్రజల్లో తిరుగుతున్న తమకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్రవంతి పేర్కొన్నారు. ఈ సంఘటనను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇరవై నాలుగ్గంటల్లోగా ఈ దుర్ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేయకపోతే ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన మునుగోడు బయల్దేరారు.