ఆ మేథావికి మ‌ళ్లీ స్వేచ్ఛా వాయువులు

By KTV Telugu On 21 October, 2022
image

– చెర‌సాల‌లోనే తుదిశ్వాస విడుస్తాన‌నుకున్నాడు
– ఓ రాజ్య‌మా…ఉలికిప‌డు!

త‌ను ప్ర‌తిఘ‌టించ‌లేడు. ప‌రిగెత్త‌లేడు. అత్య‌వ‌స‌ర‌మైతే ఒక‌రి సాయం లేకుండా ఆయ‌న వీల్‌చైర్ కూడా ముందుకు క‌ద‌ల‌లేదు. 90శాతం అంగ‌వైక‌ల్యం. ఇంకా అనేక అనారోగ్యాలు. అలాంటి వ్య‌క్తి బ‌య‌టుంటే ప్ర‌మాద‌మ‌న్నారు. దేశ‌మే క‌కావిక‌లం అయిపోతుంద‌న్నారు. దేశ‌ద్రోహి అన్నారు. కుట్ర‌లుచేశాడ‌న్నారు. అందుకే ఆ మేథావి ఎనిమిదేళ్లుగా క్రూర‌మైన ఉపా చ‌ట్టం కింద జైలుగోడ‌ల‌మ‌ధ్య న‌లిగిపోయాడు.
నాగ్‌పూర్ సెంట్ర‌ల్ జైల్లో ప్రొఫెస‌ర్ సాయిబాబా స్వేచ్ఛావాయువుల‌కు దూర‌మ‌య్యారు.

ప్ర‌జాస్వామిక‌వాదులు, పౌర‌హ‌క్కుల‌నేత‌లు ఇది అన్యాయం అని గొంతెత్తి నిన‌దించారు. మాన‌వతా దృక్ప‌థంతో ప్రొఫెస‌ర్ సాయిబాబాని విడుద‌ల చేయాల‌ని అర్థించారు. కానీ ఆయ‌న విడుద‌ల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా వ్య‌వ‌స్థ అంత‌కంటే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. ఆయ‌న అడుగు బ‌య‌టపెడితే దేశానికి ముప్పు ఉంద‌న్న‌ట్లు వాదించింది. కానీ చివ‌రికి న్యాయ‌వ్య‌వ‌స్థ ఆ ప్రొఫెస‌ర్ నిస్స‌హాయ‌స్థితిపై స్పందించింది. ఢిల్లీ యూనివ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబాను జైలునుంచి విడుద‌ల చేయాల‌ని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పునిచ్చింది.

మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెస‌ర్ సాయిబాబాకు 2017లో ట్ర‌య‌ల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ నిబంధనల కింద సాయిబాబాతో పాటు మ‌రికొంద‌రిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా అనుమ‌తించిన హైకోర్టు ధర్మాసనం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం ఏదోర‌కంగా ర‌క్షింప‌బ‌డుతూనే ఉంది. చెర‌సాలలోనే తుదిశ్వాస విడుస్తార‌నుకున్న ప్రొఫెస‌ర్ సాయిబాబా విడుద‌ల మాన‌వ‌హ‌క్కుల‌కు ఇంకా నూక‌లు మిగిలి ఉన్నాయ‌ని నిరూపించింది. అయితే విడుద‌ల త‌ర్వాత ఆయ‌న గ‌మ‌నం ఏమిట‌న్న‌దే ప్ర‌శ్న‌. 2014లో సాయిబాబా అరెస్టు కావ‌టంతో ఢిల్లీ యూనివర్సిటీ ఆయ‌న్ని సస్పెండ్‌ చేసింది. పోయినేడాది ప్రొఫెస‌ర్ సాయిబాబాని పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు సాయిబాబా నిర్దోషిగా తేలిన నేపథ్యంలో మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకుంటారా? లేదా అన్న‌ది ప్ర‌స్తుతానికి జ‌వాబులేని ప్ర‌శ్నే.