కేంద్ర ప్రభుత్వం ప్రజలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉంది. ప్రజలను దోచుకోవడమే తమ లక్ష్యమన్నట్లు…కేంద్రం వ్యవహరిస్తోంది. భారీ ఆదాయంపై కన్నేసిన కేంద్ర ప్రభుత్వం…భూగర్భ జలాల వినియోగానికి అనుమతి ఉండాల్సిందేనంటూ ప్రకటన విడుదల చేసింది. నిత్యావసరాల ధరలు కొడెక్కడంతో జనం…ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్…వినియోగదారులపై భారం మోపాలని నిర్ణయించింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. మరికొన్నింటి శ్లాబ్స్ మార్చింది. కొత్త రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానున్నాయ్.
కేంద్ర భూగర్భ జల అథారిటీ జారీ చేసిన ప్రకటన చర్చనీయంశంగా మారింది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను వినియోగిస్తుండటంతో…దానికి అడ్డుకట్ట వేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కోట్ల రూపాయల ఆదాయ అర్జనకు…శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరి జీవితంలో…నీళ్లు చాలా ముఖ్యం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు జలం లేకపోతే ఏ పనిసాగదు. దీన్నే ఆసరాగా తీసుకున్న కేంద్రం…ఎన్ఓసీ పేరుతో మెలికలు పెట్టింది.
కొత్త జీఎస్టీ రేట్లతో విద్యార్థులు, గృహిణులు, అన్నదాతలు, టూరిస్టులపై మరింత భారం పడనుంది. పన్నీరు, పెరుగు, మజ్జిగను జీఎస్టీలోకి తీసుకొచ్చి…వినియోగదారులకు ఝలక్ ఇచ్చింది. ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలో లేని అనేక ఉత్పత్తుల్ని ఈ సారి జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది.
అగ్గి పుల్ల…సబ్బు బిల్ల…కవితకు ఏదీ అనర్హం కాదన్నట్లు…కేంద్ర ప్రభుత్వం దేన్నీ వదలడం లేదు. షార్పెనర్ నుంచి చొప్పుల దాకా…హీటర్ నుంచి మ్యాపుల దాకా బాదుడే బాదుడు. అవకాశం ఉన్న అన్ని వస్తువులపైనా జీఎస్టీ మోత మోగిస్తోంది. ప్రజల నుంచి పిండుకోవడమే లక్ష్యంగా…శ్లాబులు విధించింది.
దేశవ్యాప్తంగా 2017, జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొత్త విధానంతో రాష్ట్రాలకు సంభవించే నష్టాన్ని పూడ్చేందుకు ఐదేళ్లపాటు జీఎస్టీ పరిహారం ఇస్తామని అప్పట్లో ప్రకటించింది. వచ్చే నెలతో జీఎస్టీ అమలులోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతాయ్. జులై నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పూర్తి పరిహారాన్ని ఆపేయనుంది కేంద్రం.