కొత్తగా చూసే వారికి బీజేపీ అవసరం లేని వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది. సున్నితంగా గమనిస్తే అందులో అంతర్లీనమైన రాజకీయ అనివార్యత కనిపిస్తోంది. మరి కొన్ని దశాబ్దాల పాటు కేంద్రంలో రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, కొత్త రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కమలనాథుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా వ్యూహాలు కూడా సరికొత్త రంగు పులుముకుంటున్నాయి. జిన్నా టవర్ వివాదాన్ని కూడా ఆ దిశగానే చూడాల్సి ఉంటుంది…
అక్కడ అయోధ్య, కాశీ.. మరి ఇక్కడో…!
జిన్నా టవర్ … గుంటూరుకు తలమానికం… 1940ల్లో మహ్మద్ అలీ జిన్నా, గుంటూరు నగరానికి వచ్చినందుకు సంకేతంగా ఆ టవర్ ను నిర్మించారు. నగరంలో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా జిన్నా టవర్ మీదుగా వెళ్లాలి. అందుకే నగరవాసుల్లో ప్రతీ రోజు జిన్నా టవర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. జిన్నా.. పాకిస్థాన్ వ్యవస్థాపకుడైనప్పటికీ.. భారత విభజనకు ఆయన కారకుడైనప్పటికీ…. గుంటూరు ప్రజలు మాత్రం జిన్నా టవర్ ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నగరానికి ఒక ల్యాండ్ మార్కుగానూ, ఒక కూడలిగానూ మాత్రమే పరిగణంచేవారు. ఇప్పుడు బీజేపీ పుణ్యమాని రెండు మతాల మధ్య టవరింగ్ ప్రాబ్లమ్స్ మొదలయ్యే ప్రమాదం ఏర్పడింది….
రాజకీయులు, ముఖ్యంగా బీజేపీ వారు ఏ విషయాన్ని తొందరగా తేల్చరు. నాన్చి.. నాన్చి… జనంలో చర్చలు, అనుమానాలు సృష్టించి.. ప్రజాభిప్రాయాన్ని తమవైపుకు తిప్పుకుని.. తర్వాత ఒక అనూహ్య సంఘటనను సృష్టించి.. చివరకు తాము అనుకున్నదీ సాధిస్తారు. అయోధ్యలో జరిగిందదే.. వారణాసిలో జరుగుతున్నదదే…ఇప్పుడు జిన్నాటవర్ వ్యవహారంలోనూ చేస్తున్నదదే… గుంటూరు వచ్చిన ఒక బీజేపీ నాయకుడికి జిన్నా టవర్ కనిపించింది. అప్పటి వరకు అలాంటిది ఒకటి ఉందని కూడా ఆయనకు తెలీదు. అంతే టవర్ ను కూల్చేస్తామని ప్రకటించేశారు. దాని చరిత్ర తెలియని బీజేపీ నేతలు సైతం ఆయనకు వంత పాడారు. ఇప్పుడు ఆరు నెలలుపైగా అడపా దడపా జిన్నా టవర్ ప్రస్తావన చేస్తూ జనం దాన్ని మరిచిపోకుండా చేస్తున్నారు. పార్టీలోని వివిధ మోర్ఛాలు అప్పుడప్పుడు నిరసనలు నిర్వహిస్తున్నాయి… జిన్నాటవర్ కూల్చకుండా ఉండాలంటే దానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది… గోల చేసి మరీ అక్కడ బీజేపీ జెండాలు కట్టేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు వచ్చి అక్కడ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. తగ్గేదేలే అని స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు…
దక్షిణాదిన పాగా వేసేందుకు…
బీజేపీ ఎంత ప్రయత్నించినా ఉత్తరాది పార్టీగానే మిగిలిపోతోంది. పాన్ ఇండియా లుక్ రావడం లేదు. లోక్ సభలో సంపూర్ణ మెజార్టీ సాధించినా.. అదీ ఉత్తరాది రాష్ట్రాలను స్వీప్ చేయడం వల్లే సాధ్యమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా ఎక్కడా పార్టీ మనుగడ ఉన్నట్లు కనిపించడం లేదు. కేరళలో తటస్థులను చేర్చుకుని అధికారం పొందాలన్న ప్రయత్నమూ విఫలమైంది. దానితో బీజేపీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. హిందూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడమే బీజేపీకి తెలిసిన అతి పెద్ద ఫార్ములా కావడంతో దక్షిణాదిన ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలోనే బీజేపీ నేతలకు జిన్నా టవర్ కనిపించినట్లుంది. ఇంకేముందే నిదానంగా జనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు…త్వరలో జిన్నాటవర్ పేరు మార్పు ఉద్యమం ఊపందుకోవచ్చు. అప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. దాన్ని కమలనాథులు ఎలా నడిపిస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం…