*హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ కఠినం
*హద్దు మీరితే జరిమానా
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల అక్టోబర్ 3 నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇకనుంచి ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే వంద రూపాయలు ఫైన్ పడుతుంది.
రోప్ అంటే రిమూవల్ ఆప్ అబ్‌స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ అనే పేరుతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూస్తారు. ఇందులో భాగంగా ఫుట్‌పాత్‌లను ఆక్రమణలను తొలగిస్తారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించినవారికి భారీ జరిమానా వేస్తారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మహానగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. నగరంలో రహదారులపై ప్రతిరోజు దాదాపు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ద్విచక్రవాహనాలే దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే అది క్లియర్ కావడానికి గంటల తరబడి టైమ్ పడుతోంది. ఇది ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫుట్ పాత్ల ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయడమే ట్రాఫిక్ సమస్యలకు కారణమని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం అక్టోబర్ 3 నుంచి కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.