అప్పుడే దూకుడు పెంచిన కేఏ పాల్….. ప్రచారం కూడా మొదలెట్టేశారా…

By KTV Telugu On 4 June, 2022
image

కేఏ పాల్.. ఆయన్ను అందరూ కామెడీ పీస్ గా చూస్తుంటారు. మీడియాకు ఆయన ఒక టైమ్ పాస్. ఆయన ఏం మాట్లాడినా.. జనం చూస్తారు. వింటారన్న విశ్వాసం. టీవీ ఛానెల్స్ టీఆర్పీకి పాల్ ఒక అసెట్. ఏదోక పాయింట్ పట్టుకుని పాల్ లైవ్ ఇంటర్వ్యూలు పెట్టేస్తుంటారు. మీడియా ప్రతినిధులు కూడా ఆయన్ను కామెడీగానే చూస్తూ… ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తారు. ఇది ఒక వైపు మాత్రమే.. పాల్ లో అపరిచితుడు ఉన్నాడనేది ఆయనలోని రెండో కోణం. మీడియాకు, కొందరు జనానికి.. ఆయన కామేడియన్ గా కనిపించొచ్చు. ఆయన మాత్రం సీరియస్ పాలిటిక్సే చేస్తున్నారు.. ఈ సారి తెలంగాణలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందరినీ ఓడించి తమ ప్రజాశాంతి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని పాల్ చెబుతున్నారు…

అతనే తొలి అభ్యర్థి

కొన్ని నిర్ణయాలు ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఉంటాయి. తెలంగాణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. పొత్తులు, ఎత్తులపై టైమ్ పాస్ చర్చ జరుగుతోంది. అంతలోనే పాల్ తన పని ప్రారంభించారు. తెలంగాణ పాలిటిక్స్ లో  లేటు ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్టుగా అన్ని పనులు ముగించేస్తానని పాల్ చెబుతున్నారు. జయం మనదేరా అంటూ.. ప్రజా శాంతి పార్టీ తరపున  తొలి అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. అమరవీరుడు కాసోజు  శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారికి తొలి ఎమ్మెల్యే సీటు ప్రకటించేసినట్లుగా కేఏ పాల్ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే.. తెలంగాణ అమరవీరుల కుటుంబాల అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ వసతి  సత్వరమే కల్పిస్తామని కూడా అనధికారింగా మేనిఫెస్టో సిద్ధం చేశారు.. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని..   వారికి న్యాయం జరగడం లేదని పాల్ అంటున్నారు. తెలంగాణ అమరవీరులు అంతా ఒక్కటి అవుతున్నారని చెప్పారు. తమకు జరుగుతున్న   అన్యాయాన్ని  గుర్తిస్తున్నారని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు అన్ని చోట్లకు వెళ్లి  చైతన్యవంతులను చేస్తానని ఆయన చెప్పారు.

ఒక సారి ఓడినా…

కేఎ పాల్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘోరం ఓడిపోయారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. తాను  స్వయంగా నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేశారు. మత బోధకుడిగా అంత చేశాను.. ఇంత చేశాను.. అని చెప్పుకున్నారు. తన ఛారిటీ నిధులను ప్రజల కోసం వినియోగించానన్నారు. అయినా 13 లక్షల ఓట్లు పోలైతే పాల్ సాధించిందీ కేవలం 3 వేల ఓట్లు. ఆయన మాటలకు, ఆయన సాధించిన ఓట్లకు సంబంధం లేకపోవడంతో పాల్ అప్పటి నుంచి కామెడీ పీస్ అయ్యారు..

పట్టు వదలని పాల్… అమిత్ షా అండ ఉందా ?

పట్టు వదలని విక్రమార్కుడిలా పాల్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కాబోయే కోడలే పాల్ కు స్పెషల్ అడ్వైజర్. తెలంగాణలో క్రియాశీలమవుతున్న తరుణంలోనే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. అప్పాయింట్ మెంట్ తీసుకుని వెళ్లి కలిసిన పాల్… కేంద్ర హోం మంత్రి స్వయంగా తనను పిలిపించుకున్నారని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో తనపై దాడులు చేస్తున్నారని అమిత్ షాకు ఆయన ఫిర్యాదు చేశారు… మేము చూసుకుంటాము, మీరు విజృంభించండని అమిత్ షా నుంచి ఆయనకు హామీ వచ్చినట్లుగా చెబుతున్నారు…

పవన్ పరువు తీశారా ?

పాల్.. జనసేన నేత పవన్ కల్యాణ్ పరువు తీశారనే చెప్పాలి. అమిత్ షా మాట్లాడిన అంశాలపై బీజేపీ అధికారికంగా స్పందించకపోయినా.. పాల్ మాత్రం చాలా విషయాలు చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తావన తానే చేశానని అన్నారు. రెండు శాతం ఓట్లు కూడా లేని పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షాను పాల్ అడిగారట. అందుకే ఆయనే మా వెంట పడుతున్నారని అమిత్ షా తన వద్ద చెప్పినట్లు పాల్ వెల్లడించారు. దీనితో జనసేన ఇరకాటంలో పడినట్లయ్యింది….

పార్టీలను టెన్షన్ పెడతారా ?

తెలంగాణలో బహుముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులు ఉండకపోవచ్చని, ఎవరికి వారే విడిగా పోటీ చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దానితో కొన్ని సామాజిక వర్గాలు, ఒక మతం వారు ఓటేస్తే తాను నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందని పాల్ ఆశపడుతున్నారు. పాల్ తో వచ్చిన ప్రాబ్లమ్ ఒక్కటే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ముందు వెనుక చూసుకోకుండా విమర్శలు చేస్తారు. ఎంతవారినైనా, ఏమైనా అనేస్తారు. దానితో ఇప్పుడు పాల్ మాటల కారణంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆయనకు కౌంటరిచ్చినా సమస్యే అవుతుంది. మాటకు నాలుగు మాటలు అనే టైప్  ఆయన. పైగా ఈ మధ్య మీడియా మీద కూడా ఎదురు దాడి చేస్తున్నారు….