ఉండవల్లితో కేసీఆర్ మాట్లాడింది అదేనా… గులాబీ దళపతికి క్లారిటీ వచ్చేసినట్లేనా….

By KTV Telugu On 17 June, 2022
image

ఉండవల్లి… సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా మారుతున్నారా ? ఉండవల్లిని పిలిపించుకుని కేసీఆర్ ఐదారు గంటలు మాట్లాడటం వెనుక చిదంబర రహస్యమేంటి ? అరుణ్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పిందొక్కటీ.. ప్రగతి భవన్ లో అసలు జరిగిందొక్కటా… ? నావి ఉత్తుత్తి మాటలు అని చెప్పుకునే ఉండవల్లి సలహాలకు అంత విలువ ఉందా ?

తెలంగాణ బయట టీఆర్ఎస్ ను విస్తరించే క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఒక పక్క ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటూనే.. మరో పక్క తటస్థులైన మేథావులతో మాట్లాడాలని తీర్మానించారు. ఈ దిశగానే ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి  అరుణ్ కుమార్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని జాతీయ రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పారు. కేసీఆర్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ… మీటింగ్ వివరాలను ఉండవల్లి స్వయంగా వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కు ఫుల్ క్లారిటీ ఉందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. సామాజిక, రాజకీయ అంశాలపై కేసీఆర్ తన అభిప్రాయాలను కూడా ఉండవల్లి వద్ద వెల్లడించారు…

కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి సాధించిన నేత. ఏపీ విభజనను అడ్డుకునేందుకు అరుణ్ కుమార్ చేయని ప్రయత్నం లేదు. ఏపీలో కాంగ్రెస్ కు మనుగడ లేదని గ్రహించే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. శాశ్వత రాజకీయ సన్యాసం చేసినట్లు ఆయన తరచూ చెబుతారు. ఇప్పుడు బీజేపీ మార్క్ మత విభజనను అడ్డుకుని దేశాన్ని కాపాడాలన్న నినాదంతోనే ఇద్దరూ కలిసినట్లు చెప్పుకోవాలి. భారత్ రాష్ట్ర సమితి.. అంటే బీఆర్ఎస్.. ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న వార్తల నడుమ తమ మధ్య అలాంటి చర్చే జరగలేదని ఉండవల్లి అంటున్నారు. ఐదు గంటల భేటీ సందర్భంగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వారితో ఉండటం విశేషమే. మేథావులందరినీ తన టీమ్ లో సభ్యులుగా చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఉండవల్లి వారికి అనుసంధానకర్తగా ఉంటారని టీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్న వార్త…

ఉండవల్లి అరుణ్ కుమార్ సమైక్యాంధ్రలో రెండు సార్లు లోక్ సభ ఎంపీగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. హుందాతనానికి మారుపేరైనా ఉండవల్లి.. .ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ప్రస్తుత రాజకీయల పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వ్యవసాయం, సాగునీరు సహా అన్ని ఆర్థిక అంశాలను అవగాహన చేసుకున్న విశ్లేషకుడాయన. కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ ఆయనకు బాగా తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు ఉండవల్లి వ్యూహాలు అవసరమని కేసీఆర్ భావించి ఉండొచ్చు. జాతీయ రాజకీయాలపైనా ఉండవల్లికి పూర్తి అండర్ స్టాండింగ్ ఉండటంతో కొత్త పార్టీకి ఆయన సేవలు అవసరమని కేసీఆర్ భావించే అవకాశాలూ ఉన్నాయి. అంతకు మించి ఇప్పుడు సరికొత్త వ్యూహాల దిశగా కేసీయార్ ఆడుగులు వేస్తున్న తరుణంలో ఉండవల్లి అందుకు తగ్గట్టుగా సలహాలిస్తారని ఎదురు చూస్తున్నారు…

తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి సమైక్యవాదులు .. టీఆర్ఎస్ ను వ్యతిరేకించిన మాట వాస్తవం. విభజన తర్వాత మాత్రం రాష్ట్ర అభివృద్ధి, సొంత వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఏపీ కంటే తెలంగాణే బెటర్ అనుకుని టీఆర్ఎస్ ను సమర్థిస్తూ వచ్చారు ఇప్పుడు ముక్కోణ పోటీ నెలకొన్న తరుణంలో వాళ్లు దూరం జరగకుండా ఉండేందుకు ఉండవల్లి రూపంలో కేసీయార్ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మేథావి వర్గం సాధ్యమైనంత వరకు తటస్థంగా ఉంటూ ఎన్నికల సమయంలో తమకు నచ్చిన వారికి  ఓటేసే సంప్రదాయం ఉంది. వారిని కూడా తన వైపుకు తిప్పుకోవాలి. ఉండవల్లి బ్రాహ్మణ సామిజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారిని కూడా ఆకర్షించినట్లు అవుతుందనుకోవాలి.. కేసీఅర్ .. స్టో అండ్ స్టడీగా వెళ్లాలనుకునే నేత. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన హింసలేకుండా,ఒక బొట్టు రక్తం చిందకుండా సమర్థంగా నిర్వహించారు. ఇప్పుడు  కూడా జాతీయ రాజకీయాల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నారు…కేసీఆర్ ఉండవల్లి భేటీని కేవలం ఒక లంచ్ మీటింగ్ గా మాత్రమే చూడకూడదు. మరో ఏడాదిన్న పాటు సాగే రాష్ట్ర, దేశ రాజకీయాలకు దీన్ని పునాదిగా పరిగణించాలి. ఇకపై  ఉండవల్లి ఎక్కడెక్కడికి వెళతారు… కేసీయార్ ఆయన సేవలను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఒక పాచిక వేశారని కూడా కొందరు అంటారు. ఇంతకీ ఏది నిజం.. కాలమే సమాధానం చెబుతుంది…