ఆంధ్రాపార్టీలకు కేసీఆర్ జీవం పోశారా?
బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోతుందా?
తెలంగాణలో టీడీపీ బలపడే సమయమొచ్చిందా?
వైసీపీ వ్యూహమేంటి?వైఎస్సార్టీపీ ఏం చేయబోతుంది?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ నేతలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేయడంతో, ఆ పార్టీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్, ఆంధ్రాలో ఎలా రాజకీయం చేస్తారో చూస్తామంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇక, అధికార వైసీపీ కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతించగా…బీజేపీ మాత్రం గట్టి కౌంటర్లే ఇస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే కేసీఆర్, బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా… తెలంగాణ సెంటిమెంట్ చిదిమేసుకున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంతో…తెలంగాణ అనే పదం తొలగిపోయింది. అంటే, ఓ రకంగా సెంటిమెంట్ తగ్గిపోతుందని అంచనా. ఇకపై కేసీఆర్ తన ప్రచారంలో ఆంధ్రా పార్టీలనే ప్రస్తావన వచ్చే అవకాశమే లేదు. తద్వారా రాష్ట్రంలో కనుమరుగవుతున్న ఆంధ్రా పార్టీలకు జీవం పోసినట్లైందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఆ సెంటిమెంట్ తోనే రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే రీతిలో రాష్ట్రంలో బలమైన పునాది ఏర్పడింది. కానీ, ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ తో రాజకీయాలు తారుమారు అయిపోతున్నాయి. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా…తెలంగాణలో తెలుగుదేశం లాంటి పార్టీల విస్తరణకు అవకాశం ఇచ్చినట్లైందని విశ్లేషణలు సాగుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైసీపీలు తెలంగాణలో ఉనికిని కోల్పోయాయి. ఆంధ్రాపార్టీలనే ముద్ర పడడంతో ఆ రెండు పార్టీలు ఏపీకే పరిమితమయిపోయాయి. తాజా పరిణామాలతో తెలంగాణలో నిలదొక్కుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబుకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారని తమ్ముళ్లు సంబరపడిపోతున్నారట. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏపీకన్నా తెలంగాణలోనే నేతలు, కార్యకర్తల ఎక్కువగా ఉండేవారు. ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరితోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే. ఇప్పటికీ టీడీపీకి కొన్ని జిల్లాల్లో బలమైన నాయకత్వం ఉంది. తెలంగాణలో బలపడేందుకు, బలమైన నాయకులను తయారుచేసేందుకు ఇదే మంచి సందర్భమని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. పార్టీకి పునర్వైభవం కోసం త్వరలోనే తెలంగాణలో చంద్రబాబు నాయకత్వాన్ని మారుస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇక, వైసీపీకి కాస్తో కూస్తో కేడర్ తెలంగాణలో ఉన్నా నామమాత్రంగానే ఉండిపోయాయి. ఆ పార్టీకి ఖమ్మం జిల్లాలో కొంత పట్టు ఉంది. అయితే, ఆంధ్రాలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా… తెలంగాణలో బలపడే అవకాశాలు మాత్రం తక్కువేనంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే, ఇప్పటికే వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ ద్వారా పాదయాత్రగా ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నప్పటికీ… ఆ పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడంతో వైఎస్సార్టీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. అయితే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో… షర్మిల నాయకత్వంలో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో బలపడేందుకు ఇంతకన్నా మంచి తరుణం దొరకదని వైఎస్సార్టీపీ భావిస్తోంది. సో, మొత్తంగా కేసీఆర్ బీఆర్ఎస్…అటు ఆంధ్రా పార్టీలకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు మరింత బలపడేందుకు కొత్త ఊతం ఇచ్చినట్లైందని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అంటున్నారు.