తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇందుకోసం కేసీఆర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. హనుమకొండలో ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఫోన్ల ట్యాపింగ్ గురించి టీఆర్ఎస్ మంత్రులు, నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు. మునుగోడులో ఓటుకు 40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంటోందని బండి ఆరోపించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మునుగోడులో మకాం వేశారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బీజేపీ హవాను అడ్డుకునేందుకు మునుగోడు ఎన్నికలో ఇప్పటి నుంచే అనేక కుతంత్రాలు పన్నుతున్న టీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థికి ఆర్థిక సాయం కూడా చేస్తోందన్నారు. మందు, మంది, మంత్రులతో మునుగోడు ఓటర్ల తీర్పును మార్చలేరని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నాడని తెలిపారు. టీఆర్ఎస్ పేరును కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆ తాంత్రికుడు చెప్పినందునే బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారని బండి సంజయ్ వివరించారు. తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ నడుచుకుంటున్నాడని తెలిపారు.