కేసీఆర్ ఢిల్లీ టూర్

By KTV Telugu On 28 July, 2022
image

కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు .. రొటీనా.., పెద్ద వ్యూహమే ఉందా.. ముందస్తు ఎన్నికల ప్లాన్ లో భాగంగా ఆయన కొందరు జాతీయ నేతల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారా.. జమిలి ఎన్నికల చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపై ఏదైనా చర్చ ఉంటుందా….

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…  ఆయన రాజకీయ శైలే వేరు. ఎవరి ఊహకు అందని వ్యూహాలను అమలు చేస్తూ… రాజకీయ యవనికపై తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. ప్రత్యర్థులు ఆలోచించుకునే లోపే పైఎత్తులను అమలు చేయగల దురంధరుడాయన. ఆయన ప్లానింగ్.. ఆయన వాటిని అమలు చేసే తీరు.. నభూతోనభవిష్యతీ అన్నట్లుగా ఉంటాయి. ఎగస్పార్టీ వాళ్లు ప్లాన్ వేసే లోపే దానికి విరుగుడును ఆయన అమలు చేసి చావు దెబ్బకొట్టేస్తారు…

తెలంగాణలో ముక్కోణ పోటీ ఖాయమని తేలిపోయిన తరుణంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ దూసుకొస్తోందని సర్వేలు చెబుతున్నాయి. కేసీయార్ నాయకత్వానికి మాత్రం ఎలాంటి ఢోకా లేదని అవే సర్వేలు నిగ్గుతేల్చుతున్నాయి. అయినా విశ్రమించేది లేదని గులాబీ పార్టీ నేత తేల్చేశారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్ ను ఎలా నడిపించాలో కేసీఆర్ ఒక్కరికే తెలుసు. ఆ వ్యూహం దశల వారీగా ఆయన అమలు చేస్తున్నారనే సంగతి ప్రత్యర్థులు తెలుసుకునే లోపే పుణ్యకాలం గడిచిపోయింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై గెలుపు సాధించడం అసాధ్యమని కేసీఆర్ కు ముందే తెలుసు. అయినా ఆయన వ్యూహాత్మకంగానే యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చారు. బీజేపీ ఏకఛత్రాధిపత్యాన్ని సవాలు చేయగల నాయకులున్నారని నిరూపించడమే ఆయన  అసలు వ్యూహం. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో కమలం పార్టీని ఉపేక్షించేది లేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ ను మరింత పటిష్టం చేసుకుంటూనే… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే వ్యూహంగా ఆయన ముందుకు కదులుతున్నారు. అప్పుడే బీజేపీని ఇరకాటంలో పెట్టడం సాధ్యమని ఆయనకు తెలుసు…

షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆఖరుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కేసీఆర్ మదిలో ఉన్న మెదులుతున్న ప్లాన్ ఎవరికీ తెలియకపోయినా..  ఈ ఏడాది ఆఖరుకే ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.  ఆ దిశగా ముఖ్యమంత్రి స్వయంగా జనంలోకి వెళ్లే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొత్త కాన్వాయ్ సిద్ధమవుతోంది. భద్రతా చర్యల్లో భాగంగా  8 టయోటా ల్యాండ్ క్రూయిజర్స్ తో నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ జనంలో  తిరిగేందుకు నూత‌న వాహ‌న శ్రేణి ఉండాల‌నే ఉద్దేశంతో ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వీటిని బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలుగా మార్చ‌నున్నారు. కృష్ణా జిల్లా వీరపనేని గూడెంలో వీటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. వాహనాలను ప్రత్యేక విమానంలో గన్నవరం తరలించిన అధికారులు,, అక్కడ నుంచి వీరపనేని గూడేనికి తరలించారు. వీటితో పాటు రెండు బస్సులను కూడా బుల్లెట్ ప్లూఫ్ గా మార్చుతున్నారు. భారీ సైన్యంతోనే  దళపతి రంగంలోకి దిగుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి…

కేసీయార్ తాను పర్యటించే ప్రాంతాల పరిస్థితులను  వారి సమస్యలను ముందే తెలుసుకుని… వాటికి  పరిష్కారాలతో జనం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీమ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రతీ నెల వారం పదిరోజులు జనంలో ఉండేందుకు వీలుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పార్టీ శ్రేణులు  కూడా ఎప్పటికప్పుడు ప్రగతి భవన్ కు ఫీడ్ బ్యాక్ అందిస్తూ.. కేసీయార్ టూర్లకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. దీనితో స్థానిక ప్రజల్లో అసంతృప్తి బయట పడకుండా చూసుకునే వీలుంటుంది. పైగా జనాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ టూర్లో  నిరసనలు జరిగి, గందరగోళం ఏర్పడితే అది ప్రత్యర్థులకు ప్రచారాస్త్రమయ్యే అవకాశం ఉందని కేసీయార్ కు బాగానే తెలుసు. క్షేత్ర స్థాయిలో అలాంటి పనులు జరగుకుండా ఆయన వ్యూహాలు రచించగలరు. పార్టీ వారి ధైర్యం కూడా అదేనని ప్రత్యేకంగా చెప్పాలా..