ఫ్లెక్సీలు వేసినంత వీజీకాదు నాయకా!

By KTV Telugu On 5 October, 2022
image

– బీఆర్‌ఎస్‌లో కలిసే పార్టీలేవి? కలిసొచ్చే పార్టీలేవి?
– ఇల్లు అలకగానే పండగైపోదు..కేసీఆర్‌కీ తెలుసు!

అధినేత నిర్ణయానికి నేతలంతా ఆహా అన్నారు. ఊరూవాడా ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్‌కీ నేతా కేసీఆర్‌. చూట్టానికి బావుంది. వినడానికి ఇంకా బావుంది. ఓ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చావుమొహంలో తలపెట్టి అనుకున్నది సాధించారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండుసార్లు ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయ్యారు. మాటల మాంత్రికుడు. అన్ని విషయాలపై లోతైన అధ్యయనం చేసే నాయకుడు. అలాంటి లీడర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటే ఆహ్వానించాల్సిందే. ఓపెనింగ్‌ అదిరిపోయింది. కానీ కలెక్షన్స్‌ ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ప్రశ్న.
కేసీఆర్‌ జాతీయపార్టీ బీఆర్‌ఎస్‌లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి ముందుకు వచ్చింది. చిదంబరం లోక్‌సభ స్థానానికి ఈ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా కేసీఆర్‌ జాతీయపార్టీ ప్రకటన కార్యక్రమంలో స్వయంగా పాలుపంచుకున్నారు. జేడీఎస్‌ అధ్యక్షుడి సహా కొందరు జాతీయనేతలు హాజరయ్యారు. ములాయంకి బాలేక రాలేకపోయారుగానీ అఖిలేష్‌యాదవ్ కూడా కార్యక్రమానికి రావల్సి ఉంది. పార్టీ ప్రకటన జస్ట్‌ పోస్టర్‌ రిలీజే. అసలు సిన్మా ముందుంది. దేశవ్యాప్తంగా ముఖ్యమైన అన్ని రాష్ట్రాల్లో పార్టీ జెండా ఎగరాలంటే చాలా కసరత్తు అవసరం.
తమిళనాడు పార్టీ బాటలోనే కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలతో పాటు మహారాష్ట్రకు చెందిన మరో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌తో విలీనం అవుతాయంటున్నారు. పొరుగు తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పై కేసీఆర్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ బహిరంగసభలకు సిద్ధమవుతున్నారు. విలీనం కావడానికి అక్కడ పార్టీలేమీ లేవుగానీ, ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తెలీక క్రాస్‌రోడ్స్‌లో ఉన్న లీడర్లయితే చాలామందున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో కూడా ఓపెనింగ్‌ బానే ఉండొచ్చు. ఎటొచ్చీ ఉత్తరాది పరిస్థితి ఏంటన్నదే చూడాలి. జాతీయనేతల్ని కేసీఆర్‌ ఎంతవరకు ఒప్పిస్తారో, ఏమేరకు మెప్పిస్తారో కాలమే నిర్ణయించబోతోంది.