కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 30 ఏళ్లుగా పార్టీ కోసం నీతి, నిజాయితీగా పనిచేస్తున్నా…చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. ఈ విషయంపై తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మాట ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి… కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. తాను పీసీసీ పదవిని మాత్రమే ఆశించానని, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు తనకు అవసరం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప కేసీఆర్ ప్రభుత్వంలో పేదవాడి ఇంటికల నెరవేరలేదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్మశాన వాటికలు, ప్రభుత్వ భవనాలు నిర్మించి గులాబీ రంగు వేసుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను రూ. 4లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందిస్తున్న సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని అన్నారు.