* ఎవరికి ఓటేయాలని ఓటర్లను ప్రశ్నించిన కేటీఆర్
* కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన కోమటిరెడ్డి
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతోటే తెలంగాణాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఓ ప్రశ్న సంధించారు. ఓటు ఎవరికి వేయాలి…? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్ కా… ? ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు ఒక్క పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీకా ? లేకపోతే మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ కా? అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారినుండి కాపాడింది టీఆర్ఎస్ పార్టీ నే అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మునుగోడులో ఎవరికి ఓటేయాలి…? పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టీఆర్ఎస్ కా…? ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా…? పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకా” అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పల్వాయి శ్రవంతి బరిలో నిలిచారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాకపోయినప్పటికీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు దాదాపు ఖాయం చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇకపోతే ఈ బై ఎలక్షన్‌కు ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు జరుపుతారు.