మునుగోడు మొనగాడు ఎవరో తేలిపోయిందా?

By KTV Telugu On 25 October, 2022
image

కారెక్కిన పల్లె..బీజేపీలోకి బూర?
మునుగోడులో రసవత్తర పోరు
గౌడ సామాజికవర్గంపై ప్రధానపార్టీల ఫోకస్
ఉపఎన్నికకు ముందు జంపింగ్ ల కలవరం
గులాబీ పార్టీకి షాక్ ఇచ్చిన నర్సయ్యగౌడ్
కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చిన పల్లెదంపతులు

మునుగోడులో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించే మునుగోడు బైపోల్ ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆర్థిక, సామాజిక సమీకరణలను చూసుకొని రాజకీయం నడుపుతున్నాయి. నేతల జంపింగ్ ల దగ్గర్నుంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం వరకు రాజకీయ వ్యవహారం జోరుగా సాగుతోంది. మునుగోడులో గౌడ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలీ, దళిత ఓటర్లు ప్రభావం చూపనున్నారు. ఈనేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు పోటీపడుతూ ప్రలోభపెడుతున్నాయి. ఇదిలా ఉంటే, నేతల జంపింగ్ లు పలు పార్టీలను పరేషాన్ చేస్తోంది.

ఉపసమరానికి ముందు ప్రధాన పార్టీలకు పలువురు నేతలు ఝలక్ ఇవ్వడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతల పార్టీ మార్పిడితో… తమకు ఓట్లు రాలుతాయన్న లెక్కల్లో ఆయా పార్టీలున్నాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ బాట పడితే…ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ దంపతులు గులాబీ గూటికి చేరారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదనే మనస్తాపంతో గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇక, అదే సమయంలో పల్లె రవికుమార్ కాంగ్రెస్ టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది. బూర పార్టీని వీడడంతో….. టీఆర్ఎస్, ఆ సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు పల్లె రవికుమార్ కు గాలం వేసి పార్టీలో చేర్చుకుంది.

2014 ఎన్నికల్లో భువనగిరి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా పోటీకి చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు బూర నర్సయ్య గౌడ్. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేతిలో నర్సయ్యగౌడ్ ఓడిపోయారు. మునుగోడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి… రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరుగుతోంది. అయితే, భువనగిరి నుంచి గతంలో తలపడిన రాజగోపాల్ రెడ్డి, బూర ఇద్దరూ ఇప్పుడు కాషాయజెండా పట్టడంతో… మునుగోడులో గెలుపుపై బీజేపీ ధీమాతో ఉంది. మునుగోడు కూడా భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఉండడం..ఆనియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బూరలకు మంచి పట్టుండడంతో విజయం తథ్యమని కమలనాథులు భావిస్తున్నారు. ఇక, గతంలో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరిన పల్లె రవికుమార్…ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మళ్లీ కారెక్కేశారు. పల్లె రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పల్లె గౌడ సామాజికవర్గం నేత కావడం కలిసొచ్చే అంశంగా టీఆర్ఎస్ భావిస్తోంది.