మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదని అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన అత్యాశ వల్లే ఇప్పుడు మునుగోడు ఎన్నిక వచ్చిందని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి… వాళ్లిద్దరూ కోమటిరెడ్డి లు కాదని కోవర్ట్ రెడ్డిలు అని వ్యాఖ్యానించారు. తమ్ముడు కాంట్రాక్ట్ కోసం బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే… అన్న విదేశాలకు వెళ్తున్నాడని విమర్శించారు. కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే…. తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికలను మోడీ, అమిత్ షా అహంకారానికి… తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి… తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు పదే పదే గుజరాత్ మోడల్ అంటారని, అదొక బేకార్ మోడల్ అని విమర్శించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 49 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్..దేశం కోసం జాతీయ పార్టీ పెడితే బీజేపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు