విదేశాల్లో దాక్కున్న బడాబాబుల్ని రప్పించలేమా ?

By KTV Telugu On 29 June, 2022
image

ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందా.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు నానా తంటాలు పడుతోందా…వారి నుంచి డబ్బులు రాబట్టడం తలకు మించిన భారమైందా… మాల్యా పారిపోతే ప్రజలకేంటి నష్టం… జనం ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు… వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ…

ఆర్థిక నేరగాళ్లు దర్జాగా పారిపోయేదశం మనది. ప్రభత్వం కళ్లెదుటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి బడా దొంగలు విమానమెక్కి విదేశాలకు పారిపోతున్నా.. చోద్యం చూడటంతోనే సరిపెట్టుకున్నారు. అంతా అయిపోయాక దొంగ దొంగ అని అరుస్తున్న వైనం దేశప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించినా.. అక్కడి చట్టపరమైన సమస్యలతో సంవత్సరాల తరబడి జాప్యమవుతోంది. భారత్ రాకుండా ఉండేందుకు మొహుల్ చోక్సీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.. ఇప్పట్లో వీళ్లని రప్పిస్తారన్న నమ్మకమూ లేదు…

అప్పులతో వచ్చిన డబ్బులు చూపించి మళ్లీ అప్పులు చేయడంతో మన వ్యాపార, పారిశ్రామికవెత్తలు దిట్టగానే చెప్పుకోవాలి. విమానయాన పరిశ్రమ లాభసాటి కాదని తెలిసికూడా  విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. వ్యాపారం చేశాం.. నష్టం వచ్చింది… దానికి నేనేం చేయాలంటూ మాల్యా ఎదురుదాడి చేయడం వ్యవస్థలో ఉన్న లోపాలను వేలెత్తి చూపిస్తోంది.ఇక నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ లాంటి వాళ్లు బ్యాంకు అధికారులను మేనేజ్ చేసి కొత్తరుణాలు పొందారు. పాత రుణాల గ్యారెంటీలతోనే బ్యాంకులు కొత్త రుణాలిచ్చాయి. ఉద్దేశ పూర్వక ఎగవేతదారులతో చేతులు కలిపినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ సహా పలు సంస్థల అధికారులపై కేసులు నమోదయ్యాయి.

ఉద్దేశ పూర్వక ఎగవేత దారులపై పార్లమెంటులో ఇచ్చే సమాధానాలు కూడా అరకొరగా ఉంటున్నాయి. తప్పదన్నట్లుగా లిఖిత పూర్వక సమాధానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని 72 మంది విదేశాల్లోనే ఉంటున్నారు. బ్యాంకులు లెక్కచెప్పని వారు ఇంకా పది పన్నెండు మంది అయినా ఉంటారని అంచనా. వీరందరూ బ్యాంకుల నుంచి దాదాపు లక్ష కోట్లు అప్పులు చేసి ఉంటారు. మాల్యా, మోదీ, చోక్సీ చేసిన అప్పులే 40 వేల కోట్ల రూపాయలున్నాయి. దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం మేల్కొంది. ముగ్గురు ప్రధాన ఎగవేతదారులకు సంబంధించిన 18 వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారు. అందులో 9731 కోట్ల రూపాయల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేశారు….

 

2014లో అధికారానికి వచ్చినప్పుడు ముక్కుపిండి వస్తూలు చేస్తామని డాంబికాలు పలికిన మోదీ సర్కారు తర్వాత నిస్సహాయంగా ఉండిపోయింది. రుణాల సెటిల్మెంట్ కు తాను సిద్ధంగా ఉన్నానని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద విజయ్ మాల్యా ప్రతిపాదించినప్పటికీ.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. దానితో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం వచ్చింది. మాల్యా ఫ్లైట్ ఎక్కేస్తున్నాడన్న సంగతి కూడా ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది. అనేక మంది విషయంలో ఇదే జరిగింది. మరో పక్క రికవరీలో జాప్యమే ప్రజల సొమ్ముకు శాపంగా మారింది. విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ,ఆయన ఆస్తులను జప్తు చేయగా వస్తున్న సొమ్ముకు పొంతనలేకుండా పోయింది. రుణాలు పొందే క్రమంలో ఆస్తులను విలువ కట్టినప్పుడు జరిగిన అవకతవకలే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. పైగా ఎక్కువ మంది ఎగవేతదారులు రాజకీయ పలుకుబడితోనే కొత్త అప్పులు తీసుకున్నారని విచారణలో తేలింది. దానితో తేలు కుట్టిన దొంగలా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది…

వంద రూపాయలు అప్పులు తీసుకుంటే అటాచ్ చేసిన వారి ఆస్తుల విలువ 80 రూపాయలే ఉంటుంది. అసలే రాని పరిస్థితుల్లో వడ్డీపై దృష్టి పెట్టే అవకాశమే లేకుండా పోయింది. బ్యాంకులకు సంబంధించి ఒక భారీ స్కామ్ వెలుగుచూసిన వెంటనే…. దాని ప్రభావం కొంతకాలమైనా స్టాక్ మార్కెట్లపై పడుతోంది. బ్యాంకులు దివాలా తీయడంతో బలహీన బ్యాంకులను పెద్దవాటిలో విలీనం చేస్తున్నారు. రెండేెళ్ల క్రితం పది బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చేశారు. నష్టాల ఊబి నుంచి బయట పడే ప్రయత్నంగా విలీనాలు చేస్తున్నప్పటికీ…. శక్తిమంతమైన బ్యాంకులకు కూడా అర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా… బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. బ్యాంకుల వద్ద నిధులు లేక మామూలు జనం లోన్లు పొందడం దుర్లభమవుతోంది.. బ్యాంకుల వద్ద నిధులు లేకపోతే.. సేవల రంగానికి, పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయలేవు. కారణంగా వస్తుత్పత్తి దెబ్బతింటుందని మరిచిపోకూడదు.  అప్పుడు ఉద్యోగాల్లో కోత విధిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

రైటాఫ్..అంటే రుణాల్లో కొంత భాగం పూర్తిగా రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని వల్ల ప్రజాధనం వృథా అవుతుంది. మరో పక్క ప్రాజెక్టు మన్నికను చూసుకోకుండా రుణాలివ్వడం ఆపెయ్యాలి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బ్యాంకింగ్ రంగంలో మోసాలు, అప్పులు తీసుకుని పారిపోవడాలు బాగా పెరిగాయంటున్నారు. ఆ అపవాదు నుంచి బయటపడాలి. నేరస్తుల అప్పగింత ఒప్పందాలను సక్రమంగా అమలు చేసే విధంగా ఆయా దేశాలపై వత్తిడి తీసుకురాగలిగితే… విజయ్ మాల్యా లాంటి వారిని సత్వరం ఇండియాలో కోర్టుల ముందు నిలబెట్టే వీలుంటుంది…