కరోనాలా మంకీ పాక్స్ కూడా వేగంగా విస్తరిస్తోందా.. ఇండియాలోకి ప్రవేశించడంతో ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయా… కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదేమిటి…
వ్యాధులు ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈసారి మంకీ పాక్స్ భయపెడుతోంది. తొలుత కేరళలో మంకీ పాక్స్ వెలుగు చూడగా.. ఇప్పుడు ఢిల్లీ వ్యక్తికి వచ్చింది. కేరళలో విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మంకీ పాక్స్ సోకినట్లు తెలియగా, ఢిల్లీ వ్యక్తి ఎలాంటి ఫారిన్ టూర్ కి వెళ్లకపోయినా ఈ వ్యాధి సోకింది. దీంతో ఆ వ్యాధి సోకే తీరు మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీకి అటెండ్ అయినప్పుడు సోకి.. చాలా కాలం తర్వాత బయట పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి దేహంపై దద్దుర్లు రావడంతో అతడ్ని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ లో ఉంచారు. వ్యాధి నిర్ధారణకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంకీ పాక్స్ పై నిర్లక్ష్యం వద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
కోతులకు మసూచీ తరహాలో వ్యాధి రావడంతో 1958లో మంకీ పాక్స్ ను కనిపెట్టారు. 1958లో దీన్ని కనిపెట్టారు. 1970ల్లో మానవుల్లోనూ మంకీ పాక్స్ బయటపడింది. మంకీ పాక్స్ లో రెండు జన్యు సమూహాలున్నాయి. మధ్య ఆఫ్రికన్ తరగతి మొదటిది. దాన్ని కాంగో వేరియంట్ అని కూడా అంటారు. రెండోది పశ్చిమ ఆఫ్రికా వేరియంట్. 2003 నుంచి ఆఫ్రికా బయటి దేశాలకు వ్యాపిస్తోంది. మధ్యలో దాని ప్రభావం తగ్గిపోయినా ఇప్పుడు మళ్లీ తలెత్తుతోంది. మంకీ పాక్స్ ఆరు నుంచి 13 రోజుల్లో సోకుతుంది. సగటున్న ఎనిమిదిన్నర రోజుల్లో విస్తరిస్తున్నట్లు గుర్తించారు. మంకీ పాక్స్ వ్యాధి సోకితే జ్వరం వస్తుంది. దీనితో పాటు తల నొప్పి, నడుం నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ మాదిరే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు వస్తాయి. బొబ్బలు ఏర్పడతాయి. మంకీ పాక్స్ ఎక్కువగా ఉన్న వారిలో శరీరమంతా ఈ పొక్కులు వస్తాయి. వీటి నుండి చీము, రక్తం కారుతుంది.
మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. మంకీ పాక్స్ స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గర ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంకీ పాక్స్ సోకిన వారికి నయమయ్యేందుకు కనీసం మూడు వారాలు పడుతుంది. కాస్త ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మంకీ పాక్స్ సోకిన జంతువు దేహంపై ఉన్న పుండును తాకినా…. మంకీ పాక్స్ ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు తుంపర్లు వచ్చి మీద పడినా త్వరగా సోకుతుంది. ఒక ప్రదేశంలో మంకీ పాక్స్ వచ్చినట్లు అనుమానించినప్పుడు అక్కడున్న జంతువుల నుంచి దూరంగా ఉండటమే మంచిది. హోమో సెక్సువల్స్ లో ఈ వ్యాధి తొందరగా విస్తరించే ప్రమాదముంది. మంకీ పాక్స్ వచ్చిన వారు మాత్రమే కాకుండా పక్షం రోజుల నుంచి అతడ్ని కలిసిన వాళ్లు కూడా ఐసోలేషన్ లో ఉండటమే మంచిది..
కరోనా విజృంభించి లక్షల మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఎలాంటి వైరస్ సోకినా సమాజంలో కొత్త భయాలు ఏర్పడుతున్నాయి. అయితే భయపడాల్సిన వ్యాధేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ప్రపంచ దేశాలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తుందన్న హెచ్చరిక జారీ చేసింది. 2020లో కొవిడ్ మొదలైనప్పుడు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి హెచ్చరికే చేసింది. ఈ సారి మంకీ పాక్స్ తో ఐరోపాకే ఎక్కువ ప్రమాదమని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆసియా దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకునే వీలుంది. అవసరాన్ని బట్టి ఐరోపా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాల్సి రావచ్చు. మరో పక్క మంకీ పాక్స్ రాకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన జాగ్రత్తలే తీసుకుంటోంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలని ప్రజారోగ్య శాఖ సూచించింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికను అందరూ సీరియస్ గా తీసుకోవడమే సరైన మార్గం..