రఘురామకు నోటీసుల్లో సిట్ అనూహ్య నిర్ణయం

By KTV Telugu On 29 November, 2022
image

ఎమ్మెల్యేల కొనుగోలో కేసులో రఘురామ పేరు
విచారణకు రావొద్దని ట్విస్ట్‌ ఇచ్చిన సిట్‌ అధికారులు

ఎమ్మెల్యేల కొనుగోలో కేసు దర్యాప్తు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు సిట్‌ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో బీజేపీ ముఖ్య నేత బి.ఎల్‌. సంతోష్‌, తుషార్‌, జగ్గూస్వామికి నోటీసులు ఇచ్చారు. కానీ వారెవరూ విచారణకు హాజరుకాలేదు. మరోవైపు నందకుమార్‌ భార్య చిత్రలేఖ, అడ్వకేట్లు ప్రతాప్‌గౌడ్‌, శ్రీనివాస్‌లను సిట్‌ విచారించింది. అయితే

ఈ కేసు విచారణ సందర్భంగా అనూహ్యంగా వైసీపీ రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణం రాజు పేరు బయటకొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల‌తో ర‌ఘురామ దిగిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ కుట్ర‌లో ర‌ఘురామ త‌న వంతు పాత్ర పోషించార‌నే ప్ర‌చారం జ‌రుగింది. ఇందుకు సంబంధించి విచార‌ణ సంస్థ సిట్‌కు ఆధారాలు దొరికాయ‌ని అంటున్నారు. ఆ ఆధారాలతోనే నవంబర్‌ 29వ తేదీన ఉదయం 10.30కల్లా విచారణకు హాజరుకావాలని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్ సెక్షన్‌ 41 A కింద నోటీసులు పంపించింది. రఘురామ కొంత కాలంగా ఢిల్లీలోనే ఉంటూ సొంత పార్టీపైనా, సీఎం వైఎస్‌ జగన్‌పైనా రోజూ రచ్చబండ పేరుతో ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలు చేశారు. రఘురామను ఏమీ చేయలేక వైసీపీ కూడా గాలికొదిలేసింది. అలాంటి ర‌ఘురామ‌ కు సిట్‌ నోటీసులు జారీ చేయడంతో అందరి చూపు ఆయనమీదకు మళ్లింది. అదే ఏపీ సీఐడీ కానీ, సిట్‌ కానీ ఏదైనా కేసు విచారణకు రమ్మని నోటీసులు పంపింస్తే రచ్చరచ్చ చేసి కోర్టుకు పరిగెత్తుకు వెళ్లేవారు. కానీ ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో సాగినట్లు ఇక్కడ నడవదు కదా అందుకే రఘురామ ఉన్నట్లుండి సీఎం కేసీఆర్ భజన మొదలెట్టారు.

తనకు తెలంగాణా ప్రభుత్వానికి గాని, కేసీఆర్‌కు గానీ కీడు చేసే ఆలోచన అస్సలు లేదని అన్నారు. తాను ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఆంధ్ర ప్రజలు తెలంగాణాకు వలస వెళుతున్నారని తన రచ్చబండ కార్యక్రమంలో గతంలోనే చెప్పానన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారని అలాంటప్పుడు తనకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో తనకు ఎటువంటి గొడవలు లేవన్నారు రఘురామ. జగన్ మోహన్ రెడ్డి గారి నీలినీడలు తెలంగాణా అధికారులపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. జగన్‌తో గొడవలు ఉన్నట్లుగా తనకు కేసిఆర్‌తో లేవన్నారు. పొగిడినంత సేపు పొగిడాక ఇన్‌డైరెక్టుగా కేసీఆర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. తనను ఏమైనా చేస్తే సెటిలర్ల ఓట్లు జారిపోతాయని కేసీఆర్‌కు తెలుసున్నారు. హైదరాబాదులో తాను కూడా ఒక సెటిలర్ నేనని అటువంటి పనులను వారు చేస్తారని తాను అనుకోవడం లేదని హెచ్చరించారు. తెలంగాణలో పని చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కోరారు. సిట్‌ విచారణకు హాజరువుతానని చెప్పారు.

అయితే చివరి నిముషంలో సిట్‌ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకుంది. 29వ తేదీన విచార‌ణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీలో ఉన్న రఘురామకు ఈమెయిల్ ద్వారా స‌మాచారం అందించింది. సిట్ త‌న నిర్ణ‌యాన్ని ఎందుకు మార్చుకుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరైన ఆధారాలు లేకుండా సిట్‌ అధికారాలు తొందరపడి ఎవరికీ నోటీసులు ఇవ్వరు. పార్లమెంట్‌ సభ్యుడైన రఘురామకు నోటీసులు ఇవ్వడానికి సిట్‌ వద్ద తగిన ఆధారాలు ఉండే ఉండాలి. అదే నిజమైతే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి చివరి నిమిషంలో ఇప్పుడు రావొద్దని ఎందుకు మెయిల్‌ పంపించినట్లు…?

ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్‌కు డిసెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో ర‌ఘురామ‌కు కూడా కోర్టులో ఊర‌ట ల‌భిస్తుంద‌ని సిట్ భావించింది. రఘురామ కూడా హైకోర్టుకు వెళ్లి తాను హాజరుకాకుడా మినహాయింపు తెచ్చుకుంటారేమో అనే ఆలోచనతో సిట్ తెలివిగా ర‌ఘురామ‌కు ముందే మెయిల్ పంపించింది. ఇప్పటికైతే విచార‌ణకు హాజ‌రు కాన‌వ‌స‌రం లేద‌ని మ‌ళ్లీ అవ‌స‌ర‌మ‌నుకుంటే పిలుస్తామంటూ ఆ మెయిల్ లో సమాచారం ఇచ్చింది. డిసెంబ‌ర్ 5వ తేదీ త‌ర్వాత బీఎల్ సంతోష్ విష‌యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసుకుని ఆ త‌ర్వాత ర‌ఘురామ సంగతేంటో చూద్దామని సిట్ భావిస్తున్నారేమో అనుకుంటున్నారు. సిట్‌ వ్యూహమేంటో తెలియాలంటే డిసెంబర్ 5వరకు ఆగాల్సిందే.