మునుగోడు ప్రచారంలో సమాధుల గోల

By KTV Telugu On 22 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తూ రాత్రికి రాత్రి పోస్టర్లు అంటించడం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్‌. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీల నాయకులకు సమాధులు నర్మించడం కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారు జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం సంచలనంగా మారింది. ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఈ సమాధి నర్మించారు. ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించడానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫ్లోరైడ్‌ కేంద్రానికి కేటాయించిన స్థలానికి వెళ్లే దారిలో మట్టితో సమాధి కట్టారు. దానిపై జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టారు. అక్కడే రీజినల్‌ ఫ్లోరైడ్‌ మిటిగేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పేరుతో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండుమల్కాపురంలో పర్యటించిన సమయంలో ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ స్థలంలో జేపీ నడ్డాకు సమాధి కట్టారు. ఈ సమాధిని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సమాధిని తొలగించారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్‌కు ఎన్ని సమాధులు కట్టించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇది టీఆర్ఎస్ పనే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ చర్యపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆమె ట్వీట్ చేశారు.