మహారాష్ట్ర పరిణామాలతో జాగ్రత్త పడ్డ

By KTV Telugu On 11 August, 2022
image

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్…ఎన్డీఏకు షాక్ ఇచ్చారు. కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన…ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. . వెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జేడీయూలోనూ చీలిక కోసం కాషాయా పార్టీ ట్రై చేస్తోందని గ్రహించే.. నితీష్ ముందే ఝలక్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. మహారాష్ట్ర‌లో శివసేన పరిస్థితి తన పార్టీకి రాకూడదనే నితిష్ ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్‌పై బీజేపీ స్పందించలేదు.

ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్…ప్రమాణస్వీకారం చేశారు.  సంకీర్ణ స‌ర్కారులో ఉన్న మ‌రోపార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చాకు న‌లుగురు సభ్యులు ఉన్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మ‌ద్దతు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీకి 75 స్థానాలు, కాంగ్రెస్ కు 19 స్థానాలు ఉండగా.. వామపక్షాలకు 16 సీట్లున్నాయి. 164 మంది సభ్యుల బలం ఉందంటూ… నితీష్ కుమార్ గవర్నర్ కు లేఖ ఇచ్చేశారు.  నితీశ్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నా, జేడీయూ ఎమ్మెల్యేలు…అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలోనే పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకోవాలని డిసైడయ్యారు. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల మెజార్టీ ఉంటే చాలు. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు, జేడీయూకు  45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కొన్నాళ్లుగా బీజేపీ తీరు పట్ల నితీశ్‌లో అసంతృప్తి రాజుకుంది. కేంద్ర కేబినెట్‌లో జేడీయూకి రెండు బెర్తులు కావాలంటే…ఒక్కరికే ఛాన్స్ ఇచ్చింది. నితీశ్‌ కుమార్ ను సంప్రదించకుండానే జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్రమంత్రిని చేసింది. తమ పార్టీలో ఎవరిని కేంద్రమంత్రిని చేయాలనేది కూడా అమిత్ షానే నిర్ణయించడాన్ని నితీశ్‌ అవమానంగా భావించారు. పైగా ఆర్‌సీపీ సింగ్ బీజేపీ నేతలతోనే ఎక్కువ సఖ్యతగా మెలగడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆర్‌సీపీ సింగ్‌కి.. నితీశ్ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. లోక్‌ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్‌ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్‌ భావించారు. దీంతో బీజేపీతో మిత్ర బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నితీష్ గైర్హాజరయ్యారు. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినప్పటికీ… అదే రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించిన ముఖ్యమంత్రుల భేటీకీ నితీష్ వెళ్లలేదు. పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు, కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. అంతకుముందు దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని మోడీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికీ నితీష్ హాజరుకాలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న రాజకీయ విశ్లేషకులు…నితీష్ కుమార్ ఏ క్షణమైన ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తారని అంచనా వేశారు. అనుకున్నట్లు బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పేశారు.

బీహార్‌లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో నితీశ్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2013లో ఎన్డీయేని వీడిన నితీశ్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో రెండేళ్లకే చీలిక వచ్చింది. తిరిగి 2017లో నితీశ్ మళ్లీ ఎన్డీయేతో జతకట్టారు. 2020లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు సాధించని బీజేపీ.. ఈసారి ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అయినప్పటికీ నితీశ్‌ కుమార్‌కే సీఎం సీటును ఆఫర్ చేసింది. ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర  మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్‌  పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధంలో బీటలు మరింత తేలతెల్లమయ్యాయి.

దీనికి తోడు మహారాష్ట్రలో పరిణామాలను జాగ్రత్తగా గమనించిన నితీష్ ఏదో ఒక రోజు మోదీ తమ పార్టీని చీల్చేస్తారన్న భయం పట్టుకుంది. శివసేన పరిణామాలను చూసిన తర్వాత బీజేపీతో తెగదెంపులే బెటరని డిసైడయ్యారు.