యూపీఐలకు ఆంక్షలు.. పేమెంట్‌ కష్టమే గురూ!

By KTV Telugu On 24 November, 2022
image

పేమెంట్‌ యాప్స్‌కి ఇక షరతులు వర్తిస్తాయట!

పాన్‌ కొంటే ఫోన్‌ పే. కూరగాయలు తీసుకుంటే గూగుల్‌పే. ఫ్రెండ్‌కి డబ్బు పంపాలంటే పేటీఎం. జేబులో డబ్బుతో పన్లేదు. ఎకౌంట్‌లో క్యాష్‌ ఉండి, మనీ యాప్‌కి అది లింక్‌ అయి ఉంటే చాలు. బడ్డీకొట్టునుంచి రోడ్‌సైడ్‌ వెండర్‌దాకా ప్రతీచోటా స్పాట్‌లోనే స్కానింగ్‌. నోట్ల రూపంలో నగదు మారకం బాగా తగ్గిపోయింది. కోట్లమంది ఈ తరహా లావాదేవీలకు అలవాటుపడ్డాక కొన్ని ఆంక్షలను తెరపైకి తెస్తోంది కేంద్రప్రభుత్వం. ఆర్బీఐ సూచనలతో పేమెంట్‌ యాప్‌లకు కొన్ని పరిమితులు పెడుతోంది.

పేమెంట్ యాప్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా త్వరలోనే నిబంధనలు రాబోతున్నాయి. డిజిటల్ యూపీఐ పేమెంట్లపై త్వరలోనే ట్రాన్సాక్షన్ లిమిట్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల వాల్యూమ్ క్యాప్‌ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్బీఐతో చర్చిస్తోంది. డిజిటల్‌ పేమెంట్లలో కీలకమైన ఫోన్‌ పే ఈఏడాది డిసెంబరు 31తో ముగుస్తున్న గడువును మరో మూడేళ్లు పొడిగించాలని అభ్యర్థించింది. మరికొన్ని యాప్‌లు ఐదేళ్ల పొడిగింపు కోరుకుంటున్నాయి. దీనిపై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్న ఎన్‌పీసీఐ షరతులు వర్తిస్తాయన్న సంకేతాలిస్తోంది.

ప్రస్తుతం యూపీఐ యాప్‌లలో ఎలాంటి పరిమితులు లేకుండా చెల్లింపులకు అవకాశం ఉంది. మార్కెట్‌లో గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌ల వాటానే దాదాపు 80 శాతం ఉంది. NPCI 30 శాతం వాల్యూమ్ క్యాప్ ప్రతిపాదనను సూచించింది. దాన్ని ఆర్బీఐ ఆమోదించాలని కోరుతోంది. కొన్నాళ్లక్రితం యూపీఐ లావాదేవీలపై కేంద్రం చార్జీలు విధించబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆర్థికశాఖ క్లారిటీ ఇవ్వటంతో ఊపిరిపీల్చుకున్న వినియోగదారులకు ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్పబోతున్నారు.