అసదుద్దీన్ నోట కండోమ్‌ల మాట ఎందుకొచ్చింది?
నాలుగ్గోడల మధ్య జరగాల్సిన సంసారం కూడా నేతల పుణ్యమా అని రోడ్డునపడుతోంది. ప్రైవేట్ విషయాలు కూడా పబ్లిక్‌గా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలోనే భారత్ రెండో అతి పెద్ద జనాభా ఉన్న దేశం. ఈ స్పీడ్ ఇలాగే ఉంటే త్వరలో చైనాని కూడా మించిపోతుందని గుండెలు బాదుకునేవాళ్లున్నారు. సరే మనం చైనాని క్రాస్ చేస్తామో, కంట్రోల్ చేసుకుంటామో తర్వాతి సంగతి. అసలు జనాభా పెరగడానికి కారణాలేంటన్న ఓ సామాజికచర్చ కాస్తా రాజకీయరచ్చగా మారిపోయింది.
నాగ్‌పూర్ మీటింగ్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ అవసరం అంటూనే.. భారత్‌లో అందరికీ సమానంగా వర్తించే విధానం అవసరమని నొక్కిచెప్పారు. అందరికీ అని ఆయన వత్తి పలకటంలోనే ఓ వర్గం విపరీతంగా పిల్లల్ని కనేస్తోందన్న అంతర్లీన అర్ధం ఉంది. దేశంలో మతపరమైన అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయంటోంది ఆర్ఎస్ఎస్. అడ్డూఅదుపులేకుండా జనాభా పెరగటం వల్ల మతపరమైన సమతుల్యత దెబ్బతింటోందన్నది ప్రస్తుతం భగవత్లాంటి మేథావులు చేస్తున్న ప్రచారం.
ఆర్ఎస్ఎస్ వాదన హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంటున్నారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ముస్లిం జనాభా పెరుగుతోందన్నది అసత్య ప్రచారమని గణాంకాలు చెబుతున్నారు. దేశంలో ముస్లింల జనాభా బాగా నియంత్రణలో ఉందంటున్నారు హైదరాబాద్ ఎంపీ. దేశంలో కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనంటున్నారు!
పిల్లలు పుట్టాలో లేదో, కంటే ఎంతమందిని కనాలో ఎవరి విచక్షణ వారికుంటుంది. ఈ కరువు రోజుల్లో ఒక్కరుంటే చాలనుకుంటున్నారు. ఇద్దరిని మించి పెంచలేమని అనుకుంటున్నారు. పుడుతున్నారని కంటూపోయే పరిస్థితులు లేవు. కుటుంబ నియంత్రణ గురించి అవగాహన పెంచడమో, ప్రోత్సాహకాలు ఇవ్వడమో చేయాలిగానీ జనాభా పెరుగుదలకు కారకులెవరనే పనికిమాలిన చర్చతో ఈ దేశానికి ఒరిగేదేమీ ఉండదు.