కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము బీజేపీకి ఉందా ?

By KTV Telugu On 16 September, 2022
image

కేసీఆర్ ను బీజేపీ అరెస్టు చేయగలదా.. బీజేపీ ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా అరెస్టు చేసేంత కేసులున్నాయా.. కవిత భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ ను కొట్టాలని చూస్తున్నారా.. నిజంగా బీజేపీకి అంత సీన్ లేదని తెలుసుకున్న కేసీఆర్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారా ? దీనిపై కేటీవీ స్పెషల్ స్టోరీ.

అసలు అరెస్టుల చర్చ ఎందుకొస్తోంది.. నేతలు ఏమంటున్నారు. వాస్తవ స్థితి ఏమిటి.

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కేసీఆర్ కుటుంబం ఏకంగా 8 లక్షల కోట్లు అవినీతి చేసిందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. అది రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ అప్పుల కంటే ఎక్కువని కమలంనేతలు మరిచిపోయినట్లున్నారు. అందుకే కేసీఆర్ కు బాగా కోపమొచ్చింది. దమ్ముంటే తనను జైల్లో వేయాలని బండి సంజయ్ కు నేరుగా సవాలు విసిరారు. 33 మంది బ్యాంక్ దొంగలు విదేశాల్లో తలదాచుకుంటుంటే ఏమీ చేయలేక.. తనను టార్గెట్ చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.ఈ పరంపర చాలా రోజులు ఉంటుందనే చెప్పాలి.
సీఎంగా కేసీఆర్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయనపై 64 కేసులున్నాయి. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి నివేదిక రూపొందించే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్స్ రిఫార్మ్స్ .. ADR.. కూడా దీనిపై అప్పట్లో ఒక ప్రకటన చేసింది. 64 కేసుల్లో 37 సీరియస్ కేసులు కాగా.. 3 హత్యాయత్నం కేసులు . అయితే ఇవన్నీ తెలంగాణ ఉద్యమకాలంలో ప్రభుత్వం పెట్టిన కేసులు. అరెస్టు చేసే అవకాశం లేని కేసులు.కేసీఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖామంత్రిగా ఉన్నప్పుడు 2006లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణ కాంట్రాక్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత 2015 అక్టోబరులో సీబీఐ అధికారులు ప్రగతి భవన్ కు వచ్చి ప్రశ్నించి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. కాళేశ్వరంలో అవినీతి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత హస్తం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. అందులో తండ్రి కేసీఆర్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు విమర్శలు దట్టించారు. తర్వాత మాత్రం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రగతి భవన్లో సోదాలు చేయాలంటూ రాజకీయ ప్రకటనలు మినహా బీజేపీ సాధించిదేమీ లేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాం సూత్రధారి అక్కడి ముఖ్యమంత్రి సిసోడియా అంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మొత్తం వ్యవహారం సీఎం కేజ్రీవాల్ కనుసన్నల్లో జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఎదురుదాడితో కమలం వెనక్కి తగ్గింది. మైనింగ్ ఆరోపణలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను దించెయ్యాలనుకుంది. ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫార్సుపై కేంద్రం జాప్యం చేసింది. రెండు పార్టీలు అసెంబ్లీ విశ్వాసాన్ని కూడా పొందాయి. ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ దూకుడు తగ్గడానికి అదే కారణం కావచ్చు. కేసీఆర్ వ్యూహాలు పక్కన ఉండే వారికి కూడా అర్థం కావు. అంతవరకు బీజేపీ క్లారిటీగానే ఉంది. తనను అరెస్టు చేయాలని ఆయన ఎందుకు సవాలు చేస్తున్నారో అంతుపట్టక కమలం నేతలు తలగోక్కుంటున్నారు. పైగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కేసీఆర్ కు .. టీఆర్ఎస్ కు రాష్ట్రంలో సింపథీ పెరుగుతుంది. ముక్కోణ పోటీలో విజయావకాశాలు మరింతగా మెరుగవుతాయి. అందుకే కేఎ పాల్ లాంటి ఛోటా లీడర్స్ ని రెచ్చగొట్టి .. బీజేపీ పబ్బం గడుపుకుంటోంది రాజ్ భవన్ ప్రాంగణంలోనే పాల్ ప్రెస్ మీట్ నిర్వహించి.. బీజేపీ ఆశీస్సులతో కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. రాజకీయ చదరంగంలో కేసీఆర్ ను కొట్టడం అంత సులభం కాదు. అందుకే ఆరోపణలతో పార్టీ కేడర్ ను టెన్షన్ పెట్టి .. లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తుండొచ్చు. అంతవరకే సక్సెస్ ను కూడా రుచిచూసే అవకాశం ఉంది.