గ్రౌండ్ లోకి దిగుతున్న తమ్ముళ్లు

By KTV Telugu On 26 October, 2022
image

ఉత్తరాంధ్రలో పొలిటికల్ గేమ్
వైసీపీ మూడు రాజధానుల ఆట
ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరుబాట
మూడు జిల్లాల ప్రజలు ఎవరివైపు ఉంటారో?

మూడు రాజధానుల అంశాన్ని ముందుపెట్టి ఒకరు…సమస్యలపై ఉద్యమబాట పడుతూ మరొకరు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమంటూ మూడు రాజధానులను ప్రకటించిన వైసీపీ..ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. విశాఖలో పరిపాలన రాజధానికి విపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయంటూ అధికార పార్టీ ఆట మొదలు పెడితే…వైసీపీకి కౌంటర్ గా ఉత్తరాంధ్ర సమస్యలపై సమరశంఖం పూరిస్తూ టీడీపీ కూడా గ్రౌండ్ లోకి దిగుతోంది. దీంతో, పొలిటికల్ గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. కొంతకాలంగా విశాఖ సహా పలు ప్రాంతాల్లో వైసీపీ నేతల భూ కబ్జా వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. విపక్ష పార్టీలు అధికార పార్టీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకొని టీడీపీ కదనరంగంలోకి దిగుతోంది.

విశాఖలో పరిపాలన రాజధాని కోసం ఉత్తరాంధ్రను ఏకం చేస్తున్న వైసీపీ….రాబోయే ఎన్నికల్లో అక్కడ అధికశాతం సీట్లు గెలుచుకునే వ్యూహాలకు పదును పెడుతోంది. దాంట్లో భాగంగా ఇటీవలే విశాఖ కేంద్రంగా గర్జించిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిథులు… అవసరమైతే రాజీనామాలకు సిద్ధమంటూ ముందుకు వస్తున్నారు. వైసీపీ దూకుడుతో డిఫెన్స్ లో పడిన టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే నగరంలో ఒకసారి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ..ఉత్తరాంధ్ర సమస్యలను లేవనెత్తుతూ ఈనెల 28నుంచి అక్కడ క్షేత్రస్థాయిలో పోరాటానికి సన్నద్ధమవుతోంది. బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసింది.

ఈ నెల 28న టీడీపీ నాయకుల బృందం రుషికొండపై విధ్వంసాన్ని పరిశీలించి నిరసన తెలిపేందుకు రెడీ అయింది. మరుసటి రోజు 29న దసపల్లా భూముల వద్ద..30న ఏజెన్సీలో గంజాయి సాగు, అమ్మకాలకు వ్యతిరేకంగా అరకులోయలో… 31న ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పాడేరులో… నవంబరు 1న చక్కెర కర్మాగారాల మూసివేతకు వ్యతిరేకంగా అనకాపల్లిలో… 3న సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై హిరమండలం సమీపంలోని గొట్టా బ్యారేజ్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. మొత్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర రాజకీయం వేడెక్కుతోంది. ఆ మూడు జిల్లాల ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.