ప్రకాష్‌రాజ్‌తో టీఆర్ఎస్‌కు జరిగే మేలేంటి?

By KTV Telugu On 13 May, 2022
image

తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లను కేసీఆర్ భర్తీ చేయనున్నారు. అందులో ఒకటి రెండున్నరేళ్లు మాత్రమే పదవీ కాలం ఉంది. మిగతా రెండింటింకి ఆరేళ్లు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఈ సీట్ల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. ఈ మూడింటిలో ఒకటి సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారని .. గత వారంలోనే రెండు సార్లు ప్రకాష్ రాజ్‌ను పిలిపించుకుని మాట్లాడారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ నుంచి కేసీఆర్ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారన్నది టీఆర్ఎస్ నేతలకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనేది బ్రహ్మపదార్థం. అర్థం చేసుకోవడం కష్టం. ఆయన చేతల వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలు కూడా లభించే చాన్స్ లేదు. స్వయంగా ఆయన పోటీ చేస్తేనే పరాభవం ఎదురయింది. మరి ఆయనకు రాజ్యసభ సీటిచ్చి కేసీఆర్ ఏం సాధిస్తారు ?

ఎన్నికలతోనే కొడిగట్టిన ప్రకాష్ రాజ్ వ్యక్తిగత ఇమేజ్ !

ప్రకాష్ రాజ్ అభిప్రాయాలు ఎలా ఉన్నా… ఆయన వ్యక్తిగత ప్రవర్తనపై చాలా బ్యాడ్ టాక్ ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన గెలవలేకపోవడానికి.. మంచు విష్ణు గెలవడానికి తేడా.. వ్యక్తిగత ప్రవర్తనే. తాను గొప్ప నటుడు అయితే అవ్వవొచ్చు కానీ ఇతరులను కించ పర్చకూడదు. కానీ ప్రకాష్ రాజ్ అదే చేస్తారని విమర్శలున్నాయి. ఆ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కాబట్టి ప్రకాష్ రాజ్ కన్నా… విష్ణునే బెటర్ అనుకున్నారు. ఇక నేరుగా జనరల్ ఎలక్షన్స్‌లో పాల్గొని బెంగళూరు ఎంపీగా పోటీ చేసి.. కనీసం నోటాలో పది శాతం కూడా ఓట్లు సాధించలేకపోయారు. అదీ సొంత గడ్డ మీద.

జాతీయ రాజకీయాలను సమన్వయ పరచగల వ్యక్తిత్వమా !?

ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా “జస్ట్ ఆస్కింగ్” పేరుతో ట్వీట్లు చేయడం ద్వారా రాజకీయంగా .. మోదీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా ఆయన.. బీజేపీ వ్యతిరేకుల్లో కొంత పాపులారిటీ సాధించారు. అంతే తప్ప ఆయన ప్రత్యక్షంగా చేసిందేమీ లేదు. అయితే ఈ మాత్రం దానికే బీజేపీ వ్యతిరేక పోరాటంలో ప్రకాష్ రాజ్‌ను కలుపుకుని వెళ్లాలని కేసీఆర్ డిసైడయ్యారు. ఆయన గతంలో కర్ణాటక, తమిళనాడు వంటి చోట్లకు వెళ్లినప్పుడు ఆయా నేతలతో సమావేశం అవడానికి ఉపయోగపడ్డారు. మహారాష్ట్ర కూడా తీసుకెళ్లారు. అయితే కేసీఆర్ సీఎం స్థాయిలో వెళ్తే .. ప్రకాష్ రాజ్ సాయం అక్కర్లేదు. కానీ తీసుకెళ్లారు. అయితే ప్రకాష్ రాజ్ ను ఎంపీగా ఢిల్లీకి పంపితే.. ఆయన కేసీఆర్ ఆశించినట్లుగా వ్యవహరించలగలరా.. టీఆర్ఎస్ విధి విధానాల ప్రకారం పని చేయగలరా అన్నది ఇప్పటికీ డౌటే.

ప్రకాష్ రాజ్‌లో అంత వాక్చాతుర్యం ఉందా !?

బీజేపీ మత రాజకీయాలపై ప్రకాష్ రాజ్ చాలా ప్రభావవంతంగా మాట్లాడగలరని ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు వల్ల ఆయన మాటలకు మంచి ప్రచారం కూడా వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌లో అలా మాట్లాడితే జనం ఆలోచిస్తారని కేసీఆర్ అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఆయన అలా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడిదే కలిగే ప్రభావం వేరు.. పార్టీ తరపున మాట్లాడితే వచ్చే ప్రచారం వేరు. పార్లమెంట్ లాంటి వేదికలపై ఆయన ఎలా మాట్లాడతారో స్పష్టతలేదు. కానీ తన సహజ శైలిలో దూకుడుగా మాట్లాడితే లాభం కన్నా నష్టమే జరుగుతుంది.

ప్రకాష్ రాజ్ కన్నా వినోద్ కుమారే బెటర్ !

నిజానికి టీఆర్ఎస్‌లో ఢిల్లీ వ్యవహారాల్ని చక్కబెట్టడానికి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బోయిన్ పల్లి వినోద‌్ కుమార్ వంటి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. కానీ వారినందర్నీ కాదని కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ వస్తే ప్రకాష్ రాజ్ నూ కేసీఆర్ ఆహ్వానించారు. ఆయన వద్ద ఏం ఉంది… కేసీఆర్ ఎందుకు ప్రకాష్ రాజ్ పై ఆసక్తి చూపిస్తున్నారనేది టీఆర్ఎస్ నేతలకూ తెలియడం లేదు.