చీలికలు పీలికలు..అస్థిత్వం కోల్పోతున్న శివసేన!
బాల్‌థాక్రే బతికున్నప్పుడు ఆయన కళ్లలోకి కళ్లుపెట్టి చూసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. నిజంగానే పులిలా బతికాడు. పార్టీని బెబ్బులిలా బతికించాడు. కానీ వారసులంతా తండ్రుల్లా సమర్థులు కావాలనేం లేదుగా. మరాఠాగడ్డపైనా అదే జరిగింది. బీజేపీకి దూరమై ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి అధికారంలోకి వచ్చిన ఉద్దవ్‌థాక్రే ఐదేళ్లు పట్టు నిలబెట్టుకోలేకపోయాడు. బీజేపీ సంధించిన ఏక్‌నాథ్‌షిండే ఉద్దవ్‌కి శరాఘాతం అయ్యాడు. అధికారం కోల్పోవడమే కాదు..ఇప్పుడు పార్టీని కూడా చేజార్చుకుంటున్నాడు.
ఏక్నాథ్షిండేకి పగ్గాలు రాగానే పంతానికొస్తే ప్రాణాలైనా ఇస్తామనే శివసైనికులు కూడా ప్లేటు ఫిరాయించేశారు. తోడుంటారనుకున్న ముఖ్యనేతలు కూడా గోడదూకేశారు. దీంతో మహారాష్ట్రలో తిరుగులేదనుకున్న శివసేన అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఈసీ జోక్యంతో ఆ పార్టీ గుర్తు అటూఇటూకాకుండా పోతోంది. అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు (విల్లు, బాణం) ఎవరూ వాడొద్దంటూ ఎన్నికలసంఘం ఆదేశాలిచ్చింది.
అంటే ఇటు ఉద్దవ్‌థాక్రే, అటు ఏక్‌నాథ్‌షిండే ఇద్దరికీ శివసేన ఊసెత్తే అవకాశం లేదు. ఆ పార్టీ గుర్తుని వాడుకునే చాన్స్ అస్సలు లేదు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోకుండా ఈసీ నిషేధం విధించింది. ఈ బై ఎలక్షన్ కోసం రెండు పక్షాలు తమకు నచ్చిన మూడు పేర్లు, గుర్తులను తెలపొచ్చు. వాటినుంచే ఎన్నికలసంఘం సింబల్స్ కేటాయిస్తుంది. ఈ ఏడాది జూన్‌లో శివసేన నిలువునా చీలిపోయినప్పటినుంచీ పార్టీ తమదంటే తమదంటూ షిండే, థాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. కానీ ఈసీ ఇద్దరికీ ఆ సింబల్ దక్కదని ఫ్రీజ్ చేసి పడేసింది.
పోయినచోటే పరువు దక్కించుకోవాలనుకుంటున్న ఉద్దవ్ థాక్రే వర్గం తమకు శివసేన బాలాసాహెబ్ థాక్రే, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరుతోంది. ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదంటే ఉదయించే సూర్యుడి సింబల్ ప్రతిపాదిస్తోంది. తండ్రి నిర్మించిన రాజకీయసౌధాన్ని కాపాడుకోలేక డీలాపడ్డ ఉద్దవ్‌కి అంథేరి ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా ఉంది.