తెలంగాణ కాంగ్రెస్ పార్టీకీ రాహుల్ టూర్ ఓ టానిక్‌లా మారింది. రాహుల్ పర్యటన తర్వాత పరిమామాలు.. అన్ని పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం.. డిక్లరేషన్‌పై జరుగుతున్న చర్చ కాంగ్రెస్ శ్రేణులను సైతం సంతృప్తి పరుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్క బహిరంగసభ ద్వారా అటు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశాన్ని.. పార్టీ నేతలకు పంపాల్సిన హెచ్చరికలను తెలివిగా పంపించగలిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వమని రాహుల్ గాంధీ అడిగారు. ఈ విషయంలో ఆయన మొహమాటానికి పోలేదు. అదే సమయంలో ఉత్తినే ఒక్క చాన్స్ వద్దని.. తాము ఏం చేస్తామో కూడా వివరించారు. తాము మాట నిలబెట్టుకుంటామనడానికి చత్తీస్ ఘడ్ పాలన సాక్ష్యమని కూడా చూపించారు. రాహుల్ మాటలు ప్రజల్లో ప్రభావం చూపిస్తాయని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు.
రాహుల్ సభ జరగడం ఓ ఎత్తు అయితే వ్యూహాత్మకంగా డిక్లరేషన్ ప్రకటించడం మరో ఎత్తు. అందులో రైతులకు ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయి. రాహుల్ టూర్ ను తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ చచ్చిన పార్టీ అంటూనే రాహుల్ టూర్‌ను టార్గెట్ చేసి విమర్శలకు దిగారు. రెండు రోజుల నుంచి మంత్రుల స్థాయి నేతలందరూ విమర్శిస్తూనే ఉన్నారు. డిక్లరేషన్‌ను తేలిగ్గా తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ సభలో రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను కార్నర్ చేయడం మొదలుపెట్టింది. రాహుల్ ఒక్క చోట కూడా ‘జై తెలంగాణ’ అని నినదించలేదని కొత్త వాదన వినిపిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేసిన ప్రకటనలో కొత్తదనమేమీ లేదన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ అమలుచేస్తున్న అంశాలనే స్వల్ప మార్పులు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లోనే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎవరు లెక్క చేస్తారని చెప్పుకొచ్చారు. వారు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.,. టీఆర్ఎస్ స్పందన చూస్తే .. కాంగ్రెస్ సభ రాజకీయంలో స్పష్టమైన మార్పు తెచ్చిందన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది.
తెలంగాణలో బీజేపీని రాహుల్ గాంధీ లెక్కలోకి తీసుకోలేదు. టీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటేనని ఆయన ఉదాహరణలు చెప్పారు. పార్లమెంట్‌లో మోదీ నల్లచట్టాలు తీసుకొస్తే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్‌ఎస్ మద్దతు పలికిందని గుర్తు చేరారు. అందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని బీజేపీకి తెలుసని చెప్పారు. అందుకే బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలుసుకొని బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటయ్యారని రాహుల్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కానీ ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గానీ విచారణ చేయించడం లేదని గుర్తు చేశారు. దీంతో బీజేపీ నేతలు తమను ఏమీ విమర్శించలేదు కాబట్టి కాంగ్రెస్ – టీఆర్ఎస్ ఒక్కటేనని.. ప్రగతి భవన్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందని ఆరోపించడం ప్రారంభిచారు. కానీ వారి విమర్శల్లో లాజిక్ లేకుండా పోయింది.
అదే సమయంలో ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము కొట్లాడుకుని పక్క పార్టీలను గెలిపిస్తారని చెప్పుకునే విశ్లేషణలకూ చెక్ పెట్టడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పార్టీ సిద్దాంతాలను ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా బహిరంగసభా వేదికపై నుంచి వార్నింగ్ ఇవ్వడం కొత్త. ఆయన తీరులో మార్పు వచ్చిందని … ఇప్పటివరకూ ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారని ఇక ఊరుకోబోమనే సంకేతాలు పంపినట్లుగా స్పష్టమయింది. టీ కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు టీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదన తెస్తున్నారు. టీఆర్ఎస్‌తో కుమ్మక్కయి ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ వద్ద పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయిన కొంత మంది నేతలు పొత్తుల ప్రతిపాదనలు చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రేవంత్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై రాహుల్ గాంధీ సీరియస్‌గా స్పందించారు. టీఆర్ఎస్‌తో పొత్తుపై ఎవరు చర్చించినా వారిని పార్టీ నుంచి తొలగిస్తామన్నారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీని రేసులో నిలబెట్టడానికి.. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి రేవంత్ రెడ్డి ఎలాంటి ఎఫెక్ట్ కోరుకున్నారో రాహుల్ గాంధీ అలాంటి ఎఫెక్ట్ ఇచ్చారు. పూర్తిగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన ఈ సభ నిర్వహణ రాహుల్ గాంధీని కూడా ఆకర్షించింది. సభకు భారీగా జన సమీకరణ చేస్తే రేవంత్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనికొంత మంది నేతలు లైట్ తీసుకున్నా.. జన సమీకరణలో ఎక్కడా తగ్గలేదు. రాహుల్ గాంధీ ఇమేజ్‌ను పక్కాగా వాడుకుంటున్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ఈతి బాధలకు ఓ పరిష్కారం చూపినట్లుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీకి వెళ్లబోతోంది. టీఆర్ఎస్‌తో కలిసే చాన్సే లేదు. బీజేపీ, టీఆర్ఎస్ కూడా అంతే. త్రిముఖపోటీ జరగడం ఖాయం. ఇంత కాలం టీఆర్ఎస్ కేవలం బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీని రేసులో ఉంచేందుకు ప్రయత్నించింది. దాన్ని అందుకుని బీజేపీ నేతలు హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ సభతో సీన్ మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వేడిని ఇలా కొనసాగించాల్సిన రాజకీయం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేయాల్సి ఉంది.