తెలంగాణ రాష్ట్ర సమితి తరపున బండి పార్థసారధిరెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, వరంగల్ నేత వద్దిరాజు రవిచంద్రలను కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేశారు. వీరిలో వద్దిరాజు రవిచంద్రకు రెండేళ్ల పదవి కాలం, మిగిలిన ఇద్దరికీ ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. నిజానికి ఈ పదవులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు.. ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్ లో పని చేయడం.. చాలా కాలంగా ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాలను చూపి తమకు అవకాశాలు ఇవ్వాలని చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తాను ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారికే ఇచ్చారు. కానీ వారు టీఆర్ఎస్‌కు.. ఉద్యమానికి.. తెలంగాణకు ఏం చేశారన్నదానిపై మాత్రం సంతృప్తికరమైన సమాధానం దొరకడం లేదు.
హెటెరో పార్థసారధిరెడ్డికి రాజ్యసభ – విమర్శలకు అవకాశం !
హెటెరో పార్థసారధిరెడ్డిని కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆయన టీఆర్ఎస్ పార్టీకి చేసిందేమిటని చాలా మంది చరిత్ర వెదుక్కుంటున్నారు. ఎవరికీ ఎలాంటి సమాచారం దొరకడం లేదు. కానీ ఆయన చరిత్ర చూస్తే మాత్రం అంతా ఏపీ అధికార పార్టీతో లింకులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. వైసీపీ పెద్దలతో బంధుత్వాలు కలిగి ఉండి… ఫార్మా ఇండస్ట్రీలోనే అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కరోనా కాలంలో ఆయన రెమిడెసివర్ మందుల్ని బ్లాక్‌లో అమ్మినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌కంట్యాక్స్ అధికారులు దాడులు చేస్తే హైదరాబాద్‌లో పలు అపార్టుమెంట్లలోని ఇనుప బీరువాల్లో నోట్ల కట్టలు కుక్కి పెట్టిన వ్యవహారం బట్టబయలు అయింది. దాదాపుగా నూటా యభై కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అందుకే ఆయనను రెమిడెసివర్ రెడ్డి అని పిలుస్తున్నారు. టీఆర్ఎస్‌తో కానీ ఉద్యమంతో కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారికి సీటివ్వడం టీఆర్ఎస్‌లో ఆశావహులు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వద్దిరాజు నిన్నామొన్నటి వరకూ కాంగ్రెస్ నేత !
ఇక రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలానికి ఎంపిక చేసిన నేత వద్దిరాజు రవిచంద్ర. గాయత్రి రవిగా.. గ్రానైట్ బిజినెస్‌లో పేరు పొందారు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున వరంగల్ నంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు పదవి లభించింది. కానీ టీఆర్ఎస్‌నే నమ్ముకున్న వారికి మాత్రం చాన్స్ రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతో మంది సీనియర్లు పార్టీ కోసం కష్టపడి చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాల నేతల్లోనూ అదే పరిస్థితి. ఉద్యమకారులకు.. పార్టీ కోసం పనిచేసిన వారికైనా వద్దిరాజుకు బదులుగా చాన్స్ ఇచ్చినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
నమస్తే దామోదరరావుకు ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ !
నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు మిగిలిన ఇద్దరితో పోలిస్తే రాజ్యసభకు ఎక్కువ అర్హత ఉందని అనుకోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ గొంతుక అయిన నమస్తే తెలంగాణను ఖర్చుకోర్చి ఆయన నడుపుతున్నారు. కేసీఆర్ సామాజికవర్గం అన్న ఒక్క మైనస్ తప్ప ఆయన టీఆర్ఎస్‌కు.. తెలంగాణకు ఎంతో సేవ చేశారని అనుకోవచ్చు. పైగా చాలా కాలం నుంచి ఆయనకు రాజ్యసభ సీటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్ని సార్లు రాజ్యసభ సీట్లను ఖరారు చేయాల్సి వచ్చినా .. సామాజిక సమీకరణాలతో ఆయనకు చాన్స్ రాకుండా పోతోంది. చివరికి ఆయనకు చాన్స్ దక్కింది.
ఈ రాజ్యసభ సభ్యులు కేసీఆర్ ఆలోచనల మేరకు కేంద్రంపై పోరాడగలరా ?
కేంద్రంపై కేసీఆర్ ప్రస్తుతం యుద్ధం ప్రకటించారు. ఆ మేరకు పార్లమెంట్‌లోనూ ఎంపీలు వాదనలు వినిపిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఆ ప్రకారం చూస్తే.. ఇప్పుడు ఎంపిక చేసిన ఎంపీలు.. కేంద్రంపై తిరుగులేకుండా పోరాడగలరా.. వారికి ఆ వాక్చాతుర్యం ఉందా అన్నది చాలా మందికి వస్తున్న సందేహం. హెటెరో పార్థసారధిరెడ్డి కేంద్రంపై నోరెత్తలేరు. కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయనది ఫార్మా సామ్రాజ్యం. వద్దిరాజు రవిచంద్ర… ఎంత మేర ఘాటుగా…ధాటిగా మాట్లాడతారో ఎవరికీ తెలియదు. నమస్తే దామోదర్ రావుదీ అదే పరిస్థితి.
ఈ సారి రాజ్యసభ స్థానాల ఎంపికల విషయంలో కేసీఆర్ పాత హామీలు.. అబ్లిగేషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారని.., సమీకరణాలు చూసుకోలేదన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.