అక్షత.. W/O రిషి సునాక్ D/O నారాయణమూర్తి
రిషి సునాక్. బ్రిటన్ కొత్త ప్రధాని. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. తరచూ బెంగళూరులోని అత్తారింటికి వచ్చిపోయే రిషి బ్రిటన్‌కి ప్రధాని కావటం భారతీయులందరికీ గర్వకారణం. రిషి సునాక్ ప్రస్థానమే కాదు.. బ్రిటన్ ప్రథమమహిళ కాబోతున్న ఆయన సతీమణి అక్షతమూర్తి ప్రొఫైల్ కూడా అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎన్.ఆర్ నారాయణమూర్తి కూతురిగా, రిషి సతీమణిగా అక్షత అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
అచ్చం అమ్మలాగే అక్షత సింప్లిసిటీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినా రిషిసునాక్ సతీమణి సాదాసీదా జీవితాన్నే ఇష్టపడతారు. ఇన్ఫోసిస్ కంపెనీ విలువ ప్రస్తుతం దాదాపు 75 బిలియన్ డాలర్లు. అందులో అక్షతకున్న 0.93 శాతం వాటా విలువ 700 మిలియన్ డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం రూ.5,700 కోట్ల పైమాటే. ఈమధ్యే కన్నుమూసిన బ్రిటన్‌రాణి ఎలిజబెత్-2 సంపద కంటే అక్షత మూర్తి ఆస్తి విలువే ఎక్కువ.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి వేల కోట్ల ఆస్తులున్నా ఎంతో సాదాసీదాగా ఉంటారు. నిరాడంబర జీవితాన్నే గడుపుతుంటారు. కూతురు అక్షత, కొడుకు రోహన్‌లను కూడా అలాగే పెంచారు. తోటి విద్యార్థులతో పాటు ఆటోలో స్కూల్‌కి పంపించేవారు. 1980లో పుట్టిన అక్షతమూర్తి ఫ్యాషన్ డిజైనర్. 2010లో సొంత ఫ్యాషన్ లేబుల్ అక్షత డిజైన్స్ మొదలుపెట్టారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో అక్షత ప్రతిభను 2011లో వోగ్ మ్యాగజైన్ ప్రశంసించింది. బ్రిటన్‌ని గట్టెక్కించేందుకు కీలక సమయంలో ప్రధానిగా ఎన్నికైన రిషిసునాక్ సతీమణి కూడా భర్తలాగే తనదైన సమర్థతతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.