అధికారం కోసం ఓ వ్యూహకర్త?

By KTV Telugu On 11 October, 2022
image

పొలిటికల్ స్ట్రాటజిస్టులపై ఆధారపడిన పార్టీలు
టీడీపీకి పనిచేస్తోన్న రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు?
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లే ఆలోచనలో బాబు
కాంగ్రెస్ కోసం పనిచేసే సునీల్ ను పక్కనబెట్టారనే టాక్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక పార్టీలు తమకో వ్యూహకర్త కావాలనే వెతుకులాటలో పడ్డాయి. ఇప్పటికే చాలా పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్టులను పెట్టుకున్నాయి. నాలుగు దశాబ్దాల అనుభవనం ఉన్న పార్టీలు కూడా..వ్యూహకర్తల సలహాలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీలు ప్రశాంత్ కిశోర్ పై ఆధారపడ్డాయి. అయితే, ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు పనిచేస్తుండడంతో ఆయన్ను కేసీఆర్ వదిలించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో సఫలీకృతమైన ప్రశాంత్ కిశోర్…రాబోయే ఎన్నికలకు కూడా జగన్ కోసం పనిచేస్తున్నారు. ఇక, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం…టీడీపీ కోసం పనిచేసేందుకు రాబిన్ శర్మను నియమించుకున్నారు.

రాబిన్ శర్మ టీమ్ తో పాటు సునీల్ కనుగోలు టీమ్ కూడా టీడీపీకి పనిచేస్తోందట. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సునీల్ కనుగోలు టీమ్‌ను చంద్రబాబు పక్కనపెట్టారనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జతకడుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ కోసం పనిచేసే వ్యూహకర్తకు బై చెప్పారని తెలుస్తోంది.
ఒకే పార్టీకి రెండు సంస్థలు పని చేయడం మంచిది కాదని బాబు వారిని వద్దన్నారో లేక…సునీల్ కనుగోలునే పక్కకు తప్పుకున్నారో తెలియదు గానీ….ప్రస్తుతానికి రాబిన్ శర్మ మాత్రమే ఆ పార్టీ తరపున పనిచేస్తున్నట్లు సమాచారం.

 

గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ…ఈసారి ఏపీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు లోకేశ్ లు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జగన్ రాష్ట్రంలో టీడీపీని బలహీనపర్చే ఎత్తుగడలు వేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును దెబ్బకొడితే పార్టీ పనైపోయినట్టేననే భావనతో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఇక,175 స్థానాల్లోనూ గెలిచేందుకు ఎమ్మెల్యేలకు నిధులు కుమ్మరించడంతో పాటు… ఓ ఐపాక్ సభ్యుడిని ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు నిశ్చయించుకున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్రమంతా పర్యటనలతో బిజీ అవుతున్నారు. మరోవైపు, వచ్చే ఏడాదిలో లోకేశ్ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకాలని చంద్రబాబు డిసైడయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.