మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో వలస రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే….కేసీఆర్ కాషాయదళాన్ని లక్ష్యంగా చేసుకొని ఆట మొదలుపెట్టారు. మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ను బీజేపీ తీసుకెళ్లడంతో… రివర్స్ గేర్ లో గులాబీబాస్ ఆ పార్టీ నుంచి స్వామిగౌడ్, దాసాజు శ్రవణ్ లను కారెక్కించుకున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయన రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. అసంతప్త నేతలు కొందరు తనకు దూరమయ్యే పరిస్థితులను గమనించిన కేసీఆర్…వాటికి చెక్ పెట్టాలని భావిస్తున్నారట. దాంట్లో భాగంగానే ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకోవడం ద్వారా… మరింత బలోపేతం కావడంతో పాటు ప్రత్యర్థులను గట్టి దెబ్బ కొట్టొచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన స్వామిగౌడ్, శ్రవణ్ లు..గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లినవారే. కేసీఆర్ వారికి ఎలాంటి హామీ ఇచ్చారో గానీ, తిరిగి మళ్లీ సొంతగూటికి చేరారు. వీరితో పాటు నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలను కేసీఆర్ కారెక్కమని కోరుతున్నారట. పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారట. మాజీ ఎంపీ జితేందర్రెడ్డిలో సైతం టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. కానీ, ఆయన వాటిని తిప్పికొట్టడంతో పాటు…అటు కేసీఆర్, ఇటు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలపై ఘాటు వ్యాఖ్యలే చేశారు.