దేశమంతా విద్యుత్ కొరత.. తెలంగాణలో తప్ప ! ఎలా సాధ్యమయింది ?

By KTV Telugu On 5 May, 2022
image

“నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. జనరేటర్ వేసుకోవాల్సి వచ్చింది. అక్కడ కరెంటే లేదు” అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్న తర్వాత నెటిజన్ల నుంచి అనూహ్యమైన రియాక్షన్ వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటున్నవారు.. తమ ప్రాంతంలో అసలు కరెంట్ పోవడం లేదని.. బొత్స ఎక్కడ ఉంటున్నారోనని సెటైర్లు వేశారు. అదే సమయంలో సర్‌ప్లస్ విద్యుత్ ఉన్న రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్న పంజాబ్, గుజరాత్‌లలోనూ కరెంట్ సమస్య ఏర్పడింది. డిల్లీలో అయితే మెట్రోలనూ ఆపాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణలో మాత్రం కరెంట్ సమస్య కనిపించడం లేదు. కనీసం ఏసీల్ని పరిమితంగా వాడండి అన్న సూచనలు కూడా ప్రభుత్వం చేయలేదు. సమస్య ఎదుర్కొంటున్న ప్రజలకే తీవ్రత తెలుస్తుంది. హైదరాబాద్ వాసులకు సమస్య లేదు కాబట్టి తీవ్రత తెలియడం లేదు. ఓ సారి అటూ ఇటూ వెళ్లొచ్చిన వారికి మాత్రం అవగతమవుతోంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు ఈ విజయం అసాధారణమని చెప్పుకోక తప్పదు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ కొరత !

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గంటల తరబడి కరెంట్ తీసేవారు. తెలంగాణ ఏర్పడితే అసలు కరెంట్ ఉండదని ఆ కారణంగానే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు 15వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినప్పటికీ ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనతను తెలంగాణ విద్యుత్ సంస్థలు దక్కించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. విద్యుత్ కొరత అధిగమించడానికి భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేయించారు. ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. ఫలితంగా క్రమంగా పరిస్థితి మెరుగుపడింది.

శాశ్వతంగా సమస్య పరిష్కారానికి అడుగులు !

తెలంగాణకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా కొత్త పవర్ స్టేషన్ల నిర్మాణానికి, నాణ్యమైన కరెంటు సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పవర్ స్టేషన్లతో పాటు సబ్ స్టేషన్లు, లైన్లు నిర్మించింది. ఉత్తరాదితో నిరంతరం లింకు ఉండేందుకు కొత్త లైన్లు నిర్మింపజేసింది. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నారు. భవిష్యత్ లోనూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 28 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. ఇపుడు 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది.

అభివృద్ధికి కీలకం కరెంట్ వినియోగం !

తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే అభివృద్ది ఉన్నట్లే. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 2020 డిసెంబర్ నాటికి 2,071 యూనిట్లు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 25.29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణ రాష్ట్రం సాధించింది.

బొగ్గు కొరత లేని రాష్ట్రం తెలంగాణ !

దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తగా బొగ్గు కొరత ఉంది. కానీ తెలంగాణలో మాత్రం లేదు. సింగరేణి ఉండటం ఓ కారణం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ ముందు జాగ్రత్త కూడా ఉంది. కేసీఆర్ ఇప్పుడు తమ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు అర్హత కూడా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కరెంట్ మీద ఆధారపడిన వ్యవసాయం, పరిశ్రమలే కాదు.. వేసవిలో ఉక్కపోతుల నుంచి కూడా ప్రజలకు కేసీఆర్ ముందు చూపు రిలీఫ్ నిచ్చిందని అనుకోవచ్చు.