కేటీఆర్ ఈ ఫామ్‌లో ఉంటే చాలు….. పారిశ్రామిక విప్లవమే !

By KTV Telugu On 17 June, 2022
image

మైక్రో సాఫ్ట్ డేటా సెంటర్ తెలంగాణలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని డిసైడయి ఎంవోయూ చేసుకోగానే అందరూ నోరెళ్లబెట్టారు. పదిహేను వేల కోట్లా అని.. ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోక ముందే లో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ 24వేల కోట్లు పెట్టుబడి ప్రకటించింది. తెలంగాణాకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదే. భారత్‌ అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో జపాన్‌, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన తెలంగాణ నిలుస్తోంది. ఈ రెండు మాత్రమే కాదు.. తెలంగాణలో పెట్టుబడులు పెడతామంటూ ప్రతీ రోజూ.. ఏదో ఓ దిగ్గజ కంపెనీ ఎంవోయూ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉంది.

కొద్ది రోజుల క్రితం కిటెక్స్ అనే కంపెనీ ప్రతినిధులు తెలంగాణకు వచ్చారు. వారికి పెట్టుబడులు పెట్టాలన్న ఉద్దేశం లేదు. కేవలం కేటీఆర్ రిక్వెస్ట్ మీద చూడటానికి వచ్చారు. కానీ చూసిన తర్వాత వెంటనే పెట్టుబడి ప్రకటన చేశారు. తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉందని.. అక్కడి ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీగా ఉందని అభినందించారు. ఈ విషయం చెప్పింది తెలంగాణ మీడియాతో కాదు.. కేరళ మీడియాతో. కిటెక్స్ కార్యకలాపాలు ఎక్కువగా కేరళలోనే ఉంటాయి. కానీ వారు తమ బేస్‌ను తెలంగాణకు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. కిటెక్స్ బృందానికి కేటీఆర్‌నే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది కేటీఆర్ నాయకత్వ లక్షణానికి నిదర్శనం. కేటీఆర్ ఇటీవల అమెరికా, బ్రిటన్, దావోస్‌లలో పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా పెట్టుబడుల ప్రతిపాదనలు వేల కోట్లలోనే తీసుకు వచ్చారు. కొకకోలా సహా అనేక కంపెనీలు తమ పెట్టుబడులను రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నాయి. దావోస్‌లో ఎన్నో ప్రముఖ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ పెట్టుబడులన్నీ ఆషామాషీగా రావడం లేదు. దీని వెనక కరోనా వచ్చినప్పటి నుండి కేటీఆర్ చేసిన క్రమబద్దమైన కృషి ఉంది. కరోనా ఎఫెక్ట్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని విషయాల్లోనూ మౌలికమైన మార్పులు రావడం ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో..  ఎవరూ ఊహించని మర్పులు వస్తాయని నిపుణులు ఎప్పుడో అంచనా వేశారు. ప్రపంచ తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా నుంచి అనేక సంస్థలు .. తమ కార్యకలాపాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఇదే అవకాశంగా కేటీఆర్ శరవేగంగా ఓ బ్లూ ప్రింట్ ను రెడీ చేసుకున్నారు. వెంటనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులను వేరే దేశాలకు తరలిస్తున్నాయని, వాటిని అందుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉండాలని పరిశ్రమల శాఖ అధికారులకు ప్లాన్ ఇచ్చారు. పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పని చేసేలా ప్రత్యేక టీమ్‌లనుఏర్పాటుచేశారు.

పెట్టుబడుల విషయంలో కేటీఆర్‌కు ఓ విజన్ ఉంది. అమెరికాలో చదువుకుని .. ఎమ్మెన్సీల్లో పని చేసిన అనుభవం ఉండటంతో..  పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆయన తనదైన పంథాను అవలంభిస్తున్నారు. వైరస్ ప్రభావం తగ్గగానే… సురక్షిత దేశాల్లో పెట్టుబడుల ప్రవాహం ఉంటుందని ఆయన మొదట్లోనే అంచనా వేసి.. అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. చైనాను నమ్మడం అంత మంచిది కాదన్న భావన ప్రపంచ పెట్టుబడిదారుల్లో ప్రారంభమైన విషయాన్ని గుర్తించి.. తెలంగాణలో తయారీ రంగానికీ ప్రత్యేకం ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దాని ఫలితమే రాజేష్ ఎక్స్ పోర్ట్స్ రాక.  చైనాలో ఉన్న తమ దేశాలకు చెందిన ఉత్పత్తి ప్లాంట్లను వీలైనంత త్వరగా తరలించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. బహిరంగంగా ప్రకటించకపోయినా పలు దేశాలు.. సంస్థలు.. అదే ఆలోచనలో ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో.. వారిని భారత్‌వైపు ఆకర్షిస్తే.. చైనాకు పోటీగా.. ఇండియా ఎదుగుతుందనడంతో సందేహం లేదు. కానీ ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే చొరవ కావాలి. ఆ చొరవను.. కేటీఆర్ చూపిస్తున్నారు. ఫలితాలు అందుకుంటున్నారు.

రాజకీయం రాజకీయమే.. రాష్ట్రం రాష్టమే. ఓ వైపు రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా.. ఆ వ్యవహారాలు చక్క బెట్టుకుంటూనే పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగా చికాకులు ఎదురవుతున్నా.. ఆ ప్రభావం రాష్ట్రం మీద పడకుండా చూసుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఎంతో అదృష్టం చేసుకున్నదని చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్న ప్రభుత్వాలు, పార్టీలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఈ విషయంలో కేటీఆర్ మాత్రం  నిఖార్సయిన రాజనీతి తెలిసిన నాయకుడిగా కనిపిస్తున్నారు.

ముందు తెలంగాణ తర్వాత ఏదైనా అనేది కేటీఆర్ పాలసీ. అక్కడ ఈగోలు లాంటి సమస్యలేమీ ఉండవు. కొన్నాళ్ల కిందట… టెక్ మహింద్రా సీఈవో గుర్నాని తెలంగాణకు వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే వర్షం ప్రారంభమైంది. వెంటనే కేటీఆర్ ఆ పెద్దాయన తడవకుండా గొడుగు పట్టారు. ఈ హంబుల్ నెస్ కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఇది చిన్న విషయం అనిపించొచ్చుకానీ.. ఇన్వెస్టర్లు ఓ పాలకుడిలో కోరుకునే శైలి అది. అందుకే తెలంగాణకు పెట్టుబడుల వరద. కేటీఆర్ ఈ ఫామ్‌లో ఉన్నంత కాలం .. తెలంగాణకు పెట్టుబడుల కొరతే ఉండదు.